అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్‌లో నిర్వహించిన బీటెక్ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, ఎంసీఏ మూడో సెమిస్టర్ (ఆర్–21)సప్లిమెంటరీ, ఎంబీఏ మూడో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.కృష్ణయ్య విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎస్.శ్రీధర్, డాక్టర్ అంకారావు తదితరులు పాల్గొన్నారు.
పిచ్చికుక్క వీరంగం: 15 మందికి గాయాలు
పుట్లూరు: మండల కేంద్రం పుట్లూరులో ఆదివారం పిచ్చికుక్క వీరంగం సృష్టించింది. రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న వారిపై దాడి చేసి గాయపరిచింది. సాయంత్రం వేళలోనూ ఇద్దరు చిన్నారులను పిచ్చికుక్క కరిచింది. దాదాపు 15 మంది గాయపడ్డారు. బాధితులకు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించారు. బాధితుల్లో దేవాన్ష్ అనే నాలుగేళ్ల బాలుడితో పాటు హరిప్రసాద్, నరేంద్ర, ఎల్లమ్మ, అంకన్న, నారాయణస్వామి తదితరులు ఉన్నారు.
నేడు ఏపీ ఈసెట్
అనంతపురం: డిప్లొమా విద్యార్థులు లేటరల్ ఎంట్రీ కింద బీటెక్ సెకండియర్‌లో ప్రవేశం పొందేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వర్యంలో మంగళవారం ఏపీ ఈసెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.కృష్ణయ్య సోమవారం సాయంత్రం జేఎన్‌టీయూ అనంతపురం పాలకమండలి భవనంలో మీడియాకు వెల్లడించారు. ఏపీ ఈసెట్‌కు మొత్తం 35,187 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు.
ఏపీలో 109, తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక కేంద్రంలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్, డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఐడెంటెటీ కార్డు తీసుకెళ్లాలని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు.
సూర్యప్రభ వాహనంపై లక్ష్మీ చెన్నకేశవుడు
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామి వారి భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి చంద్ర ప్రభ వాహనంపై స్వామిని ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం సర్వభూపాల, సింహ వాహనాల్లో స్వామి వారు దర్శనమివ్వనున్నట్లు ప్రధాన అర్చకులు కోనేరాచార్యులు తెలిపారు.

బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఫలితాల విడుదల

బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఫలితాల విడుదల