
ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి
బుక్కరాయసముద్రం: ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. బుక్కరాయసముద్రంలోని షిరిడీ సాయి కల్యాణమండలంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జేసీ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ హాజరయ్యారు. జేసీ మాట్లా డుతూ ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను పరిశీలించి సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అనంతరం ప్రజల నుంచి 506 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, ఆర్డీఓ కేశవ నాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, సివిల్ సప్లయ్ డీఎం రమేష్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డీపీఓ నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ, హౌసింగ్ పీడీ శైలజ, డ్వా మా పీడీ సలీం, మైన్స్ ఏడీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ సాలోమన్ పాల్గొన్నారు.
పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం అర్బన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జేసీ సోమవారం ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 12 నుంచి 20 వరకు థియరీ పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లావ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం పరీక్షకు 16,423 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 5,278 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఒకేషనల్ కోర్సుకు సబంధించి మొదటి సంవత్సరం 1,528 మంది, ద్వితీయ సంవత్సరం 1,056 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. ఇక ప్రాక్టికల్స్ ఈ నెల 28 నుంచి జూన్1 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు)లో మాత్రమే జరుగుతాయని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్‌డీఓ కేశవనాయుడు, డీవీఈఓ వెంకటరమణనాయక్, డీఈసీ సభ్యులు శంకరయ్య, నాగరత్నమ్మ, అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, డీఈఓ ప్రసాద్‌బాబు, డిప్యూటీ లేబర్ కమిషనర్ లక్ష్మినరసింహ, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ కృష్ణ చైతన్య, ఆర్‌టీసీ ఆర్‌ఎం సుమంత్ పాల్గొన్నారు.