
9న ఉరవకొండకు సీఎం రాక
ఉరవకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఖరారైంది. ఈ నెల తొమ్మిదో తేదీన ఉరవకొండలో సీఎం పర్యటించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణజ్యపన్నులు, శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సోమవారం వజ్రకరూరు మండలం ఛాయపురంలో ఆయన సీఎం పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్నిపెంచేందుకు చేపడుతున్న కాలువ వెడల్పు పనులను సీఎం పరిశీలిస్తారన్నారు. ఇప్పడొస్తున్న నీటిని రెట్టింపుస్థాయిలో తీసుకొచ్చే విధంగా ఆరు పంపులను 12 పంపులకు పెంచనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటన కోసం రాగులపాడు, లత్తవరం, ఛాయాపురం ప్రాంతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. 9వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పర్యటన ఉంటుందన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
హంద్రీ–నీవా కాలవ విస్తరణ పనులను పరిశీలించేందుకు త్వరలో సీఎం చంద్రబాబు ఉరవకొండ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ వినోద్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, ఎస్పీ జగదీష్ సోమవారం పరిశీలించారు.
లోటుపాట్లు తలెత్తరాదు
అనంతపురం టవర్‌క్లాక్: సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కేశవ్ ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలసి జిల్లా స్థాయి అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్, అసిసెంట్ కలెక్టర్ సచిన్ రహర్‌తో చర్చించి రూట్‌మ్యాప్‌ను రూపొందించారు.