అనంతపురం అర్బన్: బుక్కరాయసముద్రంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. చెరువుకట్ట సమీపంలోని శ్రీసాయిబాబా కల్యాణమండపంలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. వాటిని అధికారులు పరిశీలించి గడువులోపు పరిష్కారం చూపుతారని తెలిపారు.
భగీరథ మహర్షి జీవితం ఆదర్శప్రాయం
అనంతపురం రూరల్: భగీరథ మహర్షి జీవితం ఆదర్శ ప్రాయమని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న భగీరథ మహర్షి విగ్రహానికి ఎంపీ, కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగీరఽథ మహర్షి జీవితం నేటి తరానికి ఆదర్శ ప్రాయమన్నారు. తన కఠోర తపస్సుతో గంగను భూమి మీదకు తీసుకొచ్చిన మహానుభావుడు భగీరథుడని కొనియాడారు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. భగీరథ మహర్షి స్ఫూర్తితో జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఖుష్బూకొఠారి, బీసీ సంక్షేమశాఖ హాస్టల్ వార్డెన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మస్తాన్, జిల్లా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, సగర సంక్షేమ సంఘం నాయకులు సగర పవన్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.
16న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 16న ఉదయం 10.30 గంటలకు జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్‌లో నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశంలో సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి చర్చను ప్రారంభిస్తారన్నారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలకు సంబంధించి సమగ్ర వివరాలతో అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో పాటు అన్ని శాఖల అధికారులకు సమాచారం చేరవేసినట్లు తెలిపారు. అధికారులు గైర్హాజరు కావొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలని సూచించారు.
అక్రమ కేసులు సరికాదు
పోలీసుల వైఫల్యంతోనే ‘హెలిప్యాడ్’ ఘటన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. హెలిప్యాడ్ వద్ద జనాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారన్నారు. రోజూ ఎవరో ఒకరి మీద పనిగట్టుకుని పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులు నమోదు చేసినా.. భయపడే ప్రసక్తే లేదన్నారు. రెట్టింపు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తామన్నారు. పార్టీ అండగా ఉంటుందని, ఎవ్వరూ భయపడవద్దని అన్నారు.

బుక్కరాయసముద్రంలో నేడు పరిష్కార వేదిక