
హోరుగాలి.. జోరువాన
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో పలు చోట్ల గాలీవాన బీభత్సం సృష్టించింది. అనంతపురంలో శుక్రవారం రాత్రి హోరుగాలికి ఎక్కడికక్కడ హోర్డింగులు పడిపోయాయి. ఫ్లెక్సీలు చిరిగి ఎగిరిపోయాయి. రోడ్డు మధ్యలో పోలీసులు ఏర్పాటు చేసిన డివైడర్లు కిందపడిపోయాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగాయి. కాసేపు ఉరుములు, మెరుపులతో జోరుగా వర్షం పడటంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. రెండు గంటలకు పైగా నగరం, పరిసర ప్రాంతాలు అంధకారం అలుముకున్నాయి. చీకట్లలోనే అతికష్టం మీద వాహనాలు రాకపోకలు సాగించాయి. అనంతపురంలో 20 మి.మీ వర్షం నమోదైంది. పెద్దపప్పూరు, శింగనమల మండలాల్లో 15 మి.మీ, నార్పల, వజ్రకరూరులో 10, యల్లనూరు, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, ఉరవకొండ, పామిడి, తాడిపత్రి, యాడికి, పుట్లూరు, కణేకల్లు, డి.హీరేహాళ్ మండలాల్లో 6.మి.మీ.లోపు వర్షం కురిసింది. గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.

హోరుగాలి.. జోరువాన