
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
అనంతపురం: టీడీపీ నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రజాప్రతినిధులు తమను గుర్తించడం లేదని, పోస్టులు, పనుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని రభస చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి టీజీ భరత్ సమక్షంలోనే లుకలుకలు బయటపడ్డాయి. శుక్రవారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్ చేపట్టారు. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీపై పలువురు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మండల ఇన్‌చార్జ్‌గా ఉంటూ ఇబ్బందులు పడుతూనే పార్టీ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు తమను ఏమాత్రమూ గుర్తించకుండా ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారని యల్లనూరు మండలానికి చెందిన వాసాపురం బాబు అలియాస్ మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. స్టోర్ డీలర్‌షిప్పులు, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల్లో తమ వర్గానికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే వర్గానికి చెందిన బొప్పేపల్లి రవికుమార్ రెడ్డి కల్పించుకోవడంతో వాగ్వాదం మొదలైంది. వాసాపురం బాబు, రవికుమార్‌రెడ్డి పరస్పరం దాడి చేసుకునే స్థాయికి వెళ్లారు. ఇన్‌చార్జ్ మంత్రి కల్పించుకుని ఇద్దరినీ అతిథిగృహం నుంచి బయటకు పంపించారు. బయటకు వచ్చిన వాసాపురం బాబుపై బొప్పేపల్లి రవికుమార్‌రెడ్డి తన అనుచరులతో కలసి దాడికి యత్నించాడు. దీంతో రవికుమార్‌రెడ్డి చొక్కాను వాసాపురం బాబు అనుచరులు గట్టిగా పట్టుకోగా.. అది చిరిగిపోయింది. సమీపంలోనే ఎస్పీ కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడే రాళ్లు రువ్వుకునే స్థాయికి వెళ్లారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమణిగించారు. అనంతరం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, రవికుమార్‌రెడ్డి కలసి వెళ్లి ఎస్పీ కార్యాలయంలో వాసాపురం బాబుపై ఫిర్యాదు చేశారు.
తన్నుకున్న తమ్ముళ్లు
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సమక్షంలోనే రభస
నాయకుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు
లీలావతి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తోంది
శింగనమల: ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని డమ్మీ చేసి తల్లి బండారు లీలావతి పెత్తనం చెలాయిస్తున్నారని టీడీపీకి చెందిన వెస్ట్ నరసాపురం ఎంపీటీసీ సభ్యురాలు అంజినమ్మ, ప్రసాద్‌నాయక్ దంపతులు ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కడం లేదని వారు శుక్రవారం అనంతపురం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి టీజీ భరత్‌కు ఎమ్మెల్యే సమక్షంలోనే ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పది నెలలైనా ప్రజా సమస్యల గురించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ప్రజా సమస్యలు తీర్చకుండా పదవిలో ఉండి అవమానం పొందడం కన్నా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి, వ్యక్తిగత గౌరవం కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
టూమెన్ కమిటీకి ప్రాధాన్యత ఏదీ?
శింగనమల నియోజకవర్గంలో ఫీల్డ్ అసిసెంట్ పోస్టులను ఎమ్మెల్యే వర్గానికి చెందినవారితోనే భర్తీ చేశారని, టూమెన్ కమిటీ సిఫార్సు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడును ఇన్‌చార్జ్ మంత్రికి తెలియజేసేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సదరు కార్యకర్త తీవ్రస్థాయిలో వాగ్వాదం చేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని అతనికి మంత్రిని కలిసే అవకాశం కల్పించారు.