
ఉత్సాహంగా ఉరకలెత్తిన దున్నలు
కణేకల్లు: స్థానిక చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన దున్నపోతుల రాతిదూలం పోటీలు ఆసక్తిగా సాగాయి. స్థానిక జెడ్పీఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదిగా పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో రాతి దూలాన్ని లాగుతూ దున్నపోతులు ఉరకలేయడాన్ని చూసి ప్రజలు కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 4 గంటలకు ముగిసాయి. రైతు కె.ముజ్జుకు చెందిన దున్నపోతులు 15 నిమిషాల వ్యవధిలో 2,608.10 అడుగుల మేర దూరాన్ని రాతిదూలాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. మరో రైతు తిప్పేష్‌కు చెందిన దున్నపోతులు ద్వితీయ స్థానంలో, రైతు జి.రిజ్వంత్‌కు చెందిన దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నల యజమానులను అభినందిస్తూ సర్పంచ్ దంపతులు నిర్మల, డాక్టర్ సోమన్నతో నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో కణేకల్లు మేజర్ పంచాయతీ ఈఓ ప్రసాద్, కణేకల్లు చెరువు సంఘం అధ్యక్షుడు బీటీ రమేష్, స్థానికులు లాలెప్ప, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రాతిదూలం లాగుతున్న దున్నపోతులు