అనంతపురం అగ్రికల్చర్: ‘మన వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం’ అనే ప్రధాన అంశంతో స్థానిక పోలీసు వెల్ఫేర్ కాంప్లెక్స్‌లో ప్రభుత్వ సంస్థలు, 18 ఎన్‌జీఓలు సంయుక్తంగా ‘అనంత సుస్థిర వ్యవసాయ వేదిక’ పేరుతో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ‘మిల్లెట్‌మేళా’ సోమవారం ముగిసింది. మూడవ రోజు సోమవారం ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డితో పాటు విశ్రాంత వైస్ ఛాన్స్‌లర్ బండి వెంకటేశ్వర్లు, ప్రకృతి వనం ప్రతినిధి ప్రసాద్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, నాబార్డు డీడీఎం అనురాధ, జెడ్‌బీఎన్‌ఎఫ్ డీపీఎం లక్ష్మానాయక్ తదితరులు హాజరై వివిధ అంశాలపై రైతులు, ఎన్‌జీఓ సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రధానంగా వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం అనేవి ఒకదానితో ఒకటి ముడిపడివున్నా... ఇటీవల కాలంలో వాటిని వేర్వేరుగా చూడటంతో అటు రైతులు ఇటు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. దీని వల్ల మార్కెటింగ్, గిట్టుబాటు ధరల్లేక రైతులు నష్టపోతుండగా, రకరకాల అనారోగ్య సమస్యలతో సంపాదన మొత్తం వైద్య ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోందన్నారు. చిరుధాన్యపు పంటలను ప్రోత్సహించడంతో పాటు వాటితో తయారు చేసే ఆహారోత్పత్తుల వాడకం పెరిగితే పర్యావరణ పరిరక్షణ, ప్రజార్యోగం మెరుగుపడటమే కాకుండా రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. ప్రధానంగా రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, ఆరికలు, ఊదర్లు, అండుకొర్రలు లాంటి సంప్రదాయ, పాతతరం చిరుధాన్యపు ఉత్పత్తులు తినడంపై ప్రజలు దృష్టి సారించాలని సూచించారు. ఏఎఫ్ ఎకాలజీ, ఆర్డీటీ, వాసన్, ఏపీ మాస్, కార్డు, సీఎస్‌ఏ, రెడ్స్, టింబక్టు, రిడ్స్, స్వచ్ఛ కాడ్యమ్, ఎంపవరింగ్ భారత్, అనంత నాచురల్స్, మిల్లెట్ మ్యాజిక్, పాస్, జన జాగృతి, ఐఐఎంఆర్ తదితర ఎన్‌జీఓ ప్రతినిదులతో పాటు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాబార్డు, ఉద్యానశాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.