● వ్యక్తిపై పెద్దపప్పూరు ఎస్‌ఐ దాష్టీకం
తాడిపత్రిటౌన్: ఓ వ్యక్తిపై పెద్దపప్పూరు ఎస్‌ఐ దాష్టీకం ప్రదర్శించారు. స్టేషన్‌కు రప్పించి విచక్షణా రహితంగా కర్రలతో చితకబాదారు. దీంతో బాధితుడు స్పృహ తప్పి కోమాలోకి వెళ్లాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. పెద్దపప్పూరు మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, జగన్నాథరెడ్డిలు ఇంటి వద్ద రహదారి విషయమై వారం రోజులుగా వాదులాడుకున్నారు. జగన్నాథరెడ్డి ఫిర్యాదు మేరకు ఆదివారం నారాయణరెడ్డితో పాటు అతని సోదరుడు రామేశ్వరెడ్డిని పెద్దపప్పూరు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ స్టేషన్‌కు పిలిపించారు. ఇద్దరినీ చితకబాదారు. ఎస్‌ఐ దెబ్బలకు తట్టుకోలేక నారాయణరెడ్డి స్పృహ తప్పి కూలిపోయాడు. అయినా, సాయంత్రం వరకు ఇద్దరినీ స్టేషన్‌లోనే ఉంచుకుని రాత్రి ఇంటికి పంపించారు.ఇంటికి చేరుకున్న నారాయణరెడ్డి ఉలుకుపలుకూ లేకుండా పడిపోవడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పరామర్శ..
విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సంఘటనపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. బాధితునికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని హామీ ఇచ్చారు.
పండ్ల పక్వానికి కార్బైడ్ వాడకుండా చూడండి
● జేసీ శివ్‌నారాయణ్ శర్మ
అనంతపురం సెంట్రల్: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కార్బైడ్‌ను పండ్ల పక్వానికి వాడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మ ఆదేశించారు.సోమవారం రెవెన్యూభవన్‌లోని ప్రత్యేక చాంబర్‌లో వైద్య, ఆరోగ్య, మార్కెటింగ్, రవాణా, వ్యవసాయశాఖ, అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. కాల్షియం కార్బైడ్, ఇతరత్రా హానికరమైన రసాయనాల వాడకం నిషేధించినట్లు తెలిపారు. వీటి వాడకం వలన కలిగే దుష్ప్రభావాలపై వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ విషయంపై పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, మెడికల్ అండ్ హెల్త్, ఆహార భద్రత, జిల్లా పంచాయతీ అధికారి, ఉద్యానశాఖ, రవాణాశాఖ అధికారులతో ప్రత్యేకంగా జిల్లా కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేసవి సీజన్‌లో మార్చి నుంచి జూలై వరకూ పండ్లు మార్కెటింగ్‌కు వస్తాయని, కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపరవాణా కమిషనర్ వీర్రాజు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణచక్రవర్తి, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, డీపీఓ నాగరాజనాయుడు, ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లీమా, వ్యవసాయ, ఉద్యాన, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.