కాలవ ఇలాకాలో జోరుగా ఇసుక దందా | - | Sakshi
Sakshi News home page

కాలవ ఇలాకాలో జోరుగా ఇసుక దందా

Mar 24 2025 5:53 AM | Updated on Mar 24 2025 5:54 AM

కణేకల్లు: రాష్ట్ర ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇలాకాలో టీడీపీ నేతలు బరి తెగించారు. పట్టపగలే ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. కణేకల్లు మండలంలోని రచ్చుమర్రి ఇసుక రీచ్‌ కేంద్రంగా వీరు సాగిస్తున్న దందా.. పోలీసుల దాడులతో బట్టబయలైంది. వివరాలు.. ఆదివారం రచ్చుమర్రి రీచ్‌ నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే గ్రామస్తుల సమాచారంతో ఎస్‌ఐ నాగమధు సిబ్బందితో రీచ్‌ వద్దకు బయలుదేరారు. వీరికి కె.కొత్తపల్లి వద్ద టిప్పర్లు తారసపడ్డాయి. పోలీ సులు వాటిని నిలిపి తనిఖీ చేయగా.. పర్మిట్లు లేవని తెలిసింది. దీంతో పోలీసుస్టేషన్‌కు తరలించాలని డ్రైవర్లను ఎస్‌ఐ ఆదేశించారు. ఈ క్రమంలోనే రెండు వాహనాల డ్రైవర్లు తప్పించు కునేందుకు యత్నించగా పోలీసులు వెంబడించి ఒక టిప్పర్‌ను పట్టుకున్నారు. మొత్తం 6 టిప్పర్లను స్టేషన్‌కు తరలించారు. రచ్చుమర్రి రీచ్‌లో ఇసుక కోసం మొత్తం 12 టిప్పర్లు వెళ్లగా.. పోలీసులు చేరుకొనే లోపే ఐదు టిప్పర్లు వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.

టెండర్‌ గడువు ముగిసినా..

రచ్చుమర్రి రీచ్‌ నుంచి ఇసుక సరఫరా చేసేందుకు శ్రీహరి కన్‌స్ట్రక్షన్‌ అనే కంపెనీ దక్కించుకున్న టెండర్‌ ఈ నెల 13నే ముగిసింది. అయినా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగించారు. అయితే, పేరుకే శ్రీహరి కన్‌స్ట్రక్షన్‌ అయినా... తెర వెనుక టీడీపీ నేతల వ్యవహారంపై విమర్శలు సర్వత్రా వినిపిస్తు న్నాయి. కణేకల్లుకు అయితే టిప్పర్‌ ఇసుక రూ. 6 వేలు, ఉరవకొండకు రూ. 9 వేలు, గుంతకల్లుకు రూ. 17 వేల నుంచి 18 వేల వరకు విక్రయించినట్లు సమాచారం. ఉచిత ఇసుక అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర ఫొటోలున్న ఫ్లెక్సీలను టిప్పర్లకు కట్టి మరీ ఇసుకాసురులు దందా చేయడం చర్చనీయాంశంగా మారింది.

దందా సాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు?

కణేకల్లు: రచ్చుమర్రి రీచ్‌ నుంచి యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రాత్రి వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మారెంపల్లి మారెన్న, కోశాధికారి పాటిల్‌ నాగిరెడ్డి, కన్వీనర్‌ పాటిల్‌ బ్రహ్మానందరెడ్డిలతో కలిసి కణేకల్లు పోలీసుస్టేషన్‌కు ‘మెట్టు’ వెళ్లారు. ఎఫ్‌ఐఆర్‌ కడుతున్నామని పోలీసులు సమాధానమివ్వడంపై ఆయన మండిపడ్డారు. ఉదయం 8 గంటలకు టిప్పర్లు పట్టుబడినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... టీడీపీ నేతల ఇసుక దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ఇసుకాసురులను తప్పించాలని చూస్తే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షులు పైనేటి తిమ్మప్పచౌదరి, వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు వేమన, మాజీ కన్వీనర్‌ ఆలూరు చిక్కణ్ణ తదితరులు పాల్గొన్నారు.

6 ఇసుక టిప్పర్లను

సీజ్‌ చేసిన పోలీసులు

కాలవ ఇలాకాలో జోరుగా ఇసుక దందా 1
1/2

కాలవ ఇలాకాలో జోరుగా ఇసుక దందా

కాలవ ఇలాకాలో జోరుగా ఇసుక దందా 2
2/2

కాలవ ఇలాకాలో జోరుగా ఇసుక దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement