అనంతపురం: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం 1959–2024కు సంబంధించిన పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దాదాపు వెయ్యిమంది పూర్వ విద్యార్థులు హాజరై అప్పటి గురువులను ఘనంగా సత్కరించారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అధ్యక్షుడు వివేకానందరెడ్డి, జనరల్ సెక్రెటరీ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ పెద్దయ్య చౌదరి, ప్రిన్సిపాల్ సి.జయచంద్రారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, డాక్టర్ సి.కేశవచంద్రరావు, డాక్టర్ ఎం.రామకృష్ణారెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పూర్వ విద్యార్థి అపెక్స్ కన్‌స్ట్రక్షన్ అధినేత బి.తిరుపాల్ నగదు బహుమతి అందజేశారు. సాయి ఆదిత్య కన్‌స్ట్రక్షన్ అధినేత పురుషోత్తమ మురళీకృష్ణ, నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్, పుట్టినిల్లు ఆశ్రమం చైర్‌పర్సన్ నిర్మలా మురళి అప్పటి గురువులను ఘనంగా సత్కరించారు.