అనంతపురం అర్బన్: కలెక్టర్ వినోద్‌కుమార్ శనివారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆదివారం అక్కడ సివిల్ సర్వీసెస్ అధికారులకు జరగనున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటారు. అటు తరువాత ఈనెల 25, 26 తేదీల్లో విజయవాడలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించనున్న కాన్ఫరెన్స్‌కు హాజరవుతారు. 27న తిరిగి విధులకు హాజరవుతారని కార్యాలయ అధికార వర్గాలు వెల్లడించాయి.
చిలమకూరులో వడగండ్ల వాన
యల్లనూరు: మండలంలోని చిలమకూరు గ్రామంలో శనివారం వడగండ్ల వాన కురిసింది. సాయంత్రం దాదాపు 20 నిమిషాల పాటు వడగండ్లు పడ్డాయి. అకాల వర్షంతో మండలంలోని పలు గ్రామాల్లో టమాట, మొక్కజొన్న, తదితర పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పారా గేమ్స్‌లో సత్తా
అనంతపురం: భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో జిల్లాకు చెందిన సాకే బాబు సత్తా చాటాడు. మెన్స్ ఎఫ్–56 విభాగం షాట్‌పుట్‌లో అత్యుత్తమ ప్రతిభతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా సాకే బాబును అథ్లెటిక్స్ కోచ్ ఎస్‌ఎం మంజుల, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. నాగరాజు, ఎన్. శ్రీనివాసులు అభినందించారు.