రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేట సర్వే నంబరు 106–1 పరిధిలోని విద్యారణ్యనగర్‌లో ఇళ్ల కూల్చివేత వెనుక ఏదో గూడుపుఠాణి జరిగిందని విశ్రాంత జిల్లా జడ్జి కిష్టప్ప ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడారు. ఇళ్లను కూల్చాలని, పోలీసు ప్రొటెక్షన్ తీసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వనే లేదన్నారు. జాయింట్ కలెక్టర్ కూడా ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు కూడా ఎక్కడా ఇళ్లను తొలగించాలని కానీ, పోలీసులను పిలుచుకెళ్లండని కానీ చెప్పలేదని వివరించారు. ఇంత పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎవరు చేయమన్నారు? వీరి వెనుక ఉన్న ఆ పెద్ద శక్తి ఎవరు? అని కిష్టప్ప ప్రశ్నించారు. ఇళ్లను కూల్చడానికి డీఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్‌లే ధైర్యం చేయలేరన్నారు. ఇళ్లను కూల్చే విషయానికి సంబంధించి సుప్రీం కోర్టు ఓ కేసులో 95 పేజీల తీర్పు ఇచ్చిందన్నారు. ఆ ప్రకారం చాలా పెద్ద ప్రొసీజర్ ఉందన్నారు. ప్రొసీజర్ ఇక్కడ అటువంటిదేదీ ఫాలో కాలేదన్నారు. వాస్తవానికి కోర్టు ఉత్తర్వుల్లో మునిసిపాలిటీ పరిధిలోని సర్వే నంబరులో స్థలాన్ని స్వాధీనం చేయాలని స్పష్టంగా ఉందని తెలిపారు. కానీ వీరు మాత్రం నారాయణపురం పంచాయతీ పరిధిలోని భూమిని స్వాధీనం చేస్తున్నారని చెప్పారు. దీని వెనుక ఉన్న కుట్ర బయటకు రావాలన్నారు. ప్రజలంతా ఏకం కావాలన్నారు. ఘటనపై అన్ని రాజకీయ పార్టీలూ స్పందించాలన్నారు. బాధితులకు అండగా ఉండాలని కోరారు.
అన్ని రాజకీయ పార్టీలూ స్పందించాలి
బాధితులకు అండగా నిలవాలి
రిటైర్డు జడ్జి కిష్టప్ప