అనంతపురం అర్బన్: తమ ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్యసేవ ఆరోగ్యమిత్రలు విధులు బహిష్కరించి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అద్యక్షుడు నాగార్జునరెడ్డి మాట్లాడారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ పరిధిలో ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీస్ అసోసియేట్లు, సీసీ డీఈఓలుగా పనిచేస్తున్న వారికి 17 ఏళ్లుగా క్యాడర్ అమలు చేయకపోవడంతో ఎంటీఎస్ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగిగా గుర్తింపు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైద్యసేవ ఉద్యోగులు విధి నిర్వహణలో చనిపోతే వారి కుటుంబాలకు సాధారణ వ్యక్తికి చెల్లించినట్లే ఎక్స్‌గేషియాతో సరిపెడుతూ ఇతర ఎలాంటి ప్రయోజనాలు అందివ్వడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ లేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవన్నారు. ప్రభుత్వ సైట్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా చూపిస్తుండడంతో సంక్షేమ పథకాలు కూడా అందడం లేదన్నారు. తమ ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు అరుణ, రామాంజినేయలు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ వైద్యసేవ ఆరోగ్యమిత్రల నిరసన