● కొన్ని ఫైళ్లు దగ్ధం
● సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ఉరవకొండ: ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏడీఏ కార్యాలయం పక్కనే ఉన్న చెత్తకు నిప్పంటుకుని కిటికీలో నుంచి నిప్పు రవ్వలు పడడంతో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైరింజన్ చేరుకుని మంటలు ఆర్పింది. అప్పటికే కొన్ని ఫైళ్లు కాలిపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు.
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాల్లో చురుకుగా ఉండే రౌడీషీటర్లకు ఆయా పీఎస్‌ల అధికారులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం వారి జీవన విధానం, ప్రవర్తనలపై ఆరా తీశారు. నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రౌడీషీటర్‌పై పోలీసు నిఘా ఉంటుందని, వారి ప్రతి కదలికనూ పోలీసులు పసిగడుతూ ఉంటారని, నేరాలకు పాల్పడితే మీతో పాటు మీ కుటుంబసభ్యులూ సమాజంలో గౌరవంగా జీవించలేని పరిస్థితి ఉంటుందన్నారు. నేరాల జోలికి వెళ్లకుండా బుద్ధిగా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
చీనీ చెట్ల నరికివేత
పుట్లూరు: మండలంలోని గరుగుచింతలపల్లిలో శనివారం రాత్రి రైతు నాగరాజుకు చెందిన 110 చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఉదయాన్నే తోట వద్దకు వెళ్లిన ఆయన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాదిత రైతు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకట నరసింహ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఏడీఏ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
ఏడీఏ కార్యాలయంలో అగ్ని ప్రమాదం