కమనీయం.. ఖాద్రీశుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. ఖాద్రీశుని కల్యాణం

Mar 11 2025 12:28 AM | Updated on Mar 11 2025 12:25 AM

కదిరి: ప్రహ్లాద వరదుడు, వసంత వల్లభుడు, కాటమరాయుడిగా పూజలందుకుంటున్న ఖాద్రీ లక్ష్మీ నారసింహుని కల్యాణం కమనీయంగా సాగింది. భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. నవ వధువులుగా అలంకృతులైన శ్రీదేవి, భూదేవితో పాటు వరుడు లక్ష్మీ నారసింహుడు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో యాగశాల నుంచి పల్లకీపై కల్యాణ మండపం చేరుకున్నారు. అప్పటికే అక్కడ కిక్కిరిసిన భక్తజనం నోట శ్రీవారి గోవింద నామస్మరణ మార్మోగి పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసిన అర్చక పండితులు శ్రీవారి కల్యాణోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. ముక్కోటి దేవతలు వీక్షించే స్వామివారి వివాహాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ముందుండి జరిపిస్తున్నారని అర్చక పండితులు తెలియజేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారికి ప్రతిరూపంగా విచ్చేసే కంకణ భట్టాచార్యులు మంగళ సూత్రాలను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం భక్తులందరికీ శ్రీవారి తలంబ్రాలు పంచిపెట్టారు.

ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు..

రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకొచ్చారు. అంతకుముందు ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. లోకేష్‌ రాకతో ఆలయ ప్రాంగణం టీడీపీ శ్రేణులతో నిండిపోయింది. దీంతో సామాన్య భక్తులు శ్రీవారి కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించలేకపోయారు.

ధ్వజారోహణంతో దేవతలకు ఆహ్వానం

నృసింహుని బ్రహ్మోత్సవాలను నలుదిక్కులా చాటేందుకు సోమవారం ఉదయం ప్రధాన ఆలయం ముందున్న ధ్వజ స్తంభానికి అర్చక పండితులు గరుడ దండాన్ని ధ్వజారోహణం చేశారు. సకల దేవతలకు ఇదే శ్రీవారి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక..అని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు పేర్కొన్నారు. పాల్గుణ కృష్ణ అష్టమి నాడు అంటే ఈ నెల 22న జరగనున్న తీర్థవాది ఉత్సవం రోజున శ్రీవారి చక్రస్నానం అనంతరం ఈ గరుడ దండాన్ని అవరోహణం చేస్తారు. దీంతో ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

కమనీయం.. ఖాద్రీశుని కల్యాణం1
1/1

కమనీయం.. ఖాద్రీశుని కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement