
సాక్షి ప్రతినిధి, అనంతపురం: భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సరికొత్త సంస్కరణలకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమం కింద భూముల సమగ్ర రీ సర్వే మహా యజ్ఞంలా సాగుతోంది. భూముల రీసర్వేతో పాటు ఇకపై భూముల క్రయవిక్రయాల్లో ఎలాంటి అవకతవకలూ జరగకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్‌లో డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ పట్టాలు ఇలాంటివేమీ ఉత్పన్నం అయ్యే అవకాశమే ఉండదని అధికారులు చెబుతున్నారు.
15 రోజుల్లో సబ్‌డివిజన్
ఇకపై అమ్ముకోవాలనుకునే భూమిని సబ్ డివిజన్ అయ్యాకే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఉదాహరణకు ఒక రైతుకు 10 ఎకరాల పొలం ఉంటుంది. ఈ పొలంలో 5 ఎకరాలు అమ్ముకోవాలనుకుంటారు. ఈ రిజిస్ట్రేషన్ ఉత్తరం దిక్కునో, దక్షిణం అనో రాయించి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇకపై ఇలా ఉండదు. అమ్మే ముందు అమ్మాలనుకునే 5 ఎకరాలు తనపేరు మీదే సబ్‌డివిజన్ చేయించుకోవాలి. ఆన్‌లైన్లో దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో సబ్‌డివిజన్ చేస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో సెపరేటుగా 5 ఎకరాల భూమి కనిపిస్తుంది. వెంటనే అమ్ముకోవచ్చు. అమ్మే వారికి, కొనేవారికి దీనివల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
తహసీల్దార్ ఆపడానికి లేదు
సబ్‌డివిజన్‌కు దరఖాస్తు చేసిన రోజు నుంచి 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదో కారణాలు చూపాలి. అంతేకానీ దీన్ని ఆపడానికి లేదు. పక్కాగా ఉన్న భూములకై తే కచ్చితంగా 16వ రోజున సబ్‌డివిజన్ అయిన భూమి ఆన్‌లైన్‌లో ఉండాలి. ఒకవేళ తహసీల్దార్ కారణం లేకుండా సబ్‌డివిజన్ చెయ్యకపోతే జాయింట్ కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. దీనివల్ల దొంగ రిజిస్ట్రేషన్లకు తావుడండదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
భారీగా మిగులు భూములు
రీసర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. వాస్తవంగా ఐదెకరాల పొలం పాస్‌బుక్కులో ఉండగా, రీసర్వేలో 8 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పైగా ఉంటోంది. ఇలా ఒక్క పుట్లూరు మండలంలోనే 6 గ్రామాల్లో రీ సర్వే పూర్తి కాగా 5వేల ఎకరాలు మిగులు భూమి తేలింది. ఇలా జిల్లా మొత్తంగా 80వేల ఎకరాలు ఎక్కువగా తేలే అవకాశం ఉందని అధికారులు తీస్తున్నారు. ఈ మిగులు భూములను ప్రభుత్వ భూములుగా కనపరుస్తున్నారు.
పారదర్శకంగా క్రయవిక్రయాలు
నకిలీ రిజిస్ట్రేషన్లకు పూర్తిగా చెక్
దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో సబ్‌డివిజన్
రీసర్వే అనంతరం పక్కాగా భూముల క్రయవిక్రయాలు
జిల్లాలో భారీగా మిగులు భూములు ఉన్నట్టు రీసర్వేలో వెల్లడి
వివాదాలకు కళ్లెం
సబ్ డివిజన్ చేసిన తర్వాతే భూములు అమ్మడం, రిజిస్ట్రేషన్ కావడం అనేది రెవెన్యూ సంస్కరణల్లో చాలా కీలకమైనది. దీనివల్ల రిజి స్ట్రేషన్‌ల విషయంలో ఎప్పుడూ వివాదం ఉండదు. బాధితులు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.
–కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్
భవిష్యత్ తరాలకు గొప్ప వరం
సబ్ డివిజన్ అనంతరం రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయి. త్వరలో దీన్ని అమలు చేయబోతున్నాం. దీనివల్ల భవిష్యత్‌లో ఏ భూమి కొనాలన్నా అమ్మాలన్నా నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. నకిలీలకు తావే ఉండదు.
–మోహన్‌కుమార్, తహసీల్దార్, పుట్లూరు