
సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ గౌతమి
అనంతపురం అర్బన్: ‘స్పందన’, ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాల్లో ప్రజల నుంచి అందే అర్జీలను సత్వరం పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఎమ్.గౌతమి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ‘స్పందన’ నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ గాయత్రిదేవి, ఆర్‌డీఓ గ్రంధి వెంకటేశ్, డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, ఆనంద్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 308 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. తమ శాఖ సిబ్బందితో రోజూ సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు.
వినతులు కొన్ని..
● ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ కోటా కింద తనకు సాగు భూమి మంజూరు చేయాలని ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎం.మద్దిలేటి (మరుగుజ్జు) వాపోయారు. చియ్యేడు పొలం సర్వే నంబరు 155లో 2.50 ఎకరాలు సర్వే చేశారని, తన పేరున ఫైలు కూడా సిద్ధం చేశారని చెప్పారు. ఇప్పటి వరకు భూమి మంజూరు చేయలేదని, తహసీల్దారును అడిగితే సాగులో ఉన్న వారికి పట్టా ఇస్తామంటున్నారని వాపోయారు. భూమి ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
● సాగులో తాము ఉంటే వేరొకరు ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారని బుక్కరాయసముద్రం మండలం చెదల్ల గ్రామానికి చెందిన సుశ్మిత ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 10లో 4.31 ఎకరాలను సాగు చేసుకుంటున్నామని, కోర్టులోనూ ఆ వ్యక్తిది ఫేక్ అని తేలిందన్నారు. ఆన్‌లైన్‌లో వారి పేరు తొలగించి తన పేరు నమోదు చేయాలని కోరారు.
● భూమిని సర్వే చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కణేకల్లు మండలం గంగలాపురానికి చెందిన తాయన్న విన్నవించారు. గ్రామ పొలం సర్వే నంబరు 1165–2లో తనకు రెండు ఎకరాలు ఉందన్నారు. సర్వే చేసి హద్దులు చూపించాలని అధికారులను విన్నవించినా పట్టించుకోలేదని చెప్పారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారులకు కలెక్టర్ గౌతమి ఆదేశం
‘స్పందన’లో 308 వినతులు