‘అనంత’ను కోనసీమగా మారుద్దాం

- - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, పేద వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని కలెక్టర్‌ గౌతమి అన్నారు. గతంలో వేరుశనగ పంపిణీ అంటే రైతులు క్యూ లైన్లలో పడిన అవస్థలు కళ్లారా చూశామన్నారు. అప్పట్లో అదొక శాంతిభద్రతల సమస్యగా ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదన్నారు. రైతును రాజుగా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా రైతు ముంగిటకే ఆర్‌బీకేల ద్వారా అన్ని సేవలూ అందిస్తోందన్నారు. ఈ–క్రాప్‌ ఆధారంగా అర్హత కలిగిన ప్రతి రైతుకూ ప్రయోజనాలతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌, ఎంఎస్‌పీ కొనుగోళ్లు, సున్నావడ్డీ లాంటి పథకాలు పారదర్శకంగా నేరుగా రైతుకే అందిస్తున్నట్లు వివరించారు. అంతర్జాతీయ మిల్లెట్‌ ఇయర్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది జిల్లాలో చిరుధాన్యపు పంటల సాగుకు రైతులు ముందుకు వస్తే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తామని తెలిపారు. వైవిధ్యంగా, ప్రయోగాత్మకంగా అనేక రకాలైన వాణిజ్య, ఉద్యాన పంటలు సాగు చేస్తూ కరువుసీమ ‘అనంత’ను కోనసీమగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌ యంత్రసేవ కింద రూ.23.15 కోట్లతో ట్రాక్టర్లు, పరికరాలు

230 సీహెచ్‌సీ రైతుగ్రూపులకు రూ.8.15 కోట్ల రాయితీ చెక్కు విడుదల

● ‘మెగామేళా’కు భారీగా హాజరైన రైతులు

ఇది రైతు ప్రభుత్వం : జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, కలెక్టర్‌ గౌతమి

ఆర్‌బీకే వ్యవస్థతో విప్లవాత్మక మార్పులకు నాంది

రైతులకు ఇతోధికంగా సర్కారు సాయం

రైతులకు పంపిణీ చేసిన వ్యవసాయ ట్రాక్టర్లు

అనంతపురం అగ్రికల్చర్‌: దేశంలోనే ప్రప్రథమంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వ్యవస్థతో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాంది పలికారు. నాలుగేళ్లుగా అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు, మందులను ఆర్బీకే వేదికగా అందుబాటులోకి తీసుకురావడం, పెట్టుబడులకు ఇబ్బంది కలగకుండా రైతుభరోసా సొమ్ముతో సాయం అందించడం, పంట సాగు మొదలు విక్రయం వరకు అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో రైతుల కోసం ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందించేందుకు శుక్రవారం అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల ఎదురుగానున్న మైదానంలో జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) బి.చంద్రానాయక్‌ అధ్యక్షతన మెగా మేళా నిర్వహించారు. వైఎస్సార్‌ యంత్ర సేవ పథకంలో భాగంగా జిల్లాలోని 230 రైతుమిత్ర గ్రూపులకు కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) కింద మంజూరైన రూ.23.15 కోట్ల విలువ చేసే 169 ట్రాక్టర్లు, 1,161 ఆధునిక సేద్యపు పరికరాలు, మొదటి సారిగా మంజూరు చేసిన మూడు కంబైన్డ్‌ హార్వెస్టర్లను జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, కలెక్టర్‌ గౌతమి చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఇందులో రైతుగ్రూపులకు ప్రభుత్వం వర్తింపజేసిన రూ.8.15 కోట్ల రాయితీని మెగా చెక్కు రూపంలో అందించారు. అనంతరం నగరంలో ట్రాక్టర్లతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.

రైతు ప్రభుత్వం

తమది రైతు ప్రభుత్వమని జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌, పంట రుణాల సున్నావడ్డీ, రైతుభరోసా, రాయితీ విత్తనాలు, ఎరువులు, యంత్ర సేవ, సూక్ష్మసేద్యం, ప్రయోగశాలలు, 1962 వెటర్నరీ అంబులెన్సులు, 108, 104 సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆసరా, చేయూత, చేదోడు, విద్యాదీవెన, వసతి దీవెన.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు, కార్యక్రమాలతో రైతు కుటుంబాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వమన్నారు. అనంతరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్‌పర్సన్‌ లిఖిత, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ టి.రాజశేఖర్‌రెడ్డి, సభ్యులు ఆలమూరు సుబ్బారెడ్డి, రైతుమిత్ర గ్రూపు సభ్యులు భాస్కర్‌రెడ్డి, నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ బోర్డుమెంబర్‌ గద్దె కేశవరెడ్డి, ఉద్యానశాఖ డీడీ రఘునాథరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ జి.ఫిరోజ్‌ఖాన్‌, తహసీల్దార్‌ శ్రీధర్‌, డీసీసీబీ జీఎం కె.సురేఖారాణి, ఏడీఏ ఎం.రవి తదితరులు పాల్గొన్నారు.

117

వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం కింద ట్రాక్టర్ల పంపిణీని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్‌ గౌతమి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మెగా మేళాకు హాజరైన రైతులు

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top