
రామచంద్ర, ముత్యాలక్క (ఫైల్)
● రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి ● పండుగ పూట విషాదం
ఆత్మకూరు: కడవరకూ భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా బతికిన ఆ దంపతులు మరణంలోనూ ఒకరిని వీడి మరొకరు ఉండలేకపోయారు. పండుగ పూట ఈ విషాదం చోటు చేసుకోవడంతో ఆత్మకూరు వాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన బోయ రామచంద్ర (58), ముత్యాలక్క (55) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆర్డీటీలో డ్రైవర్‌గా రామచంద్ర పనిచేస్తున్నాడు. పూల వ్యాపారం సాగిస్తూ కుటుంబానికి చేదోడుగా ముత్యాలక్క నిలిచింది. ఈ క్రమంలోనే పిల్లలను పెంచి పెద్ద చేసి, పెళ్లిళ్లూ చేశారు. ఎప్పటిలానే దంపతులిద్దరూ గురువారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరారు. వడ్డుపల్లి వద్దకు చేరుకోగానే అనంతపురం నుంచి మడకశిర వైపుగా వెళుతున్న బొలెరో వాహనాన్ని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ రాంగ్‌రూట్‌లో నేరుగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఘటనతో రామచంద్ర, ముత్యాలక్క రోడ్డు పక్కన ఉన్న చెత్త దిబ్బల్లోకి ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న అనంతరం బొలెరో సైతం బోల్తాపడింది. ఆ సమయంలో పెద్ద శబ్దం కావడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్ సురక్షితంగా బయటపడి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

నుజ్జునుజ్జైన ద్విచక్ర వాహనం