
అప్పేచర్లలో బందోబస్తు
● మరో ఇద్దరికి ఆర్నెళ్ల జైలు శిక్ష
● ఇంకో ఇద్దరికి జరిమానా విధింపు
● విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో గుత్తి ఏడీజే కోర్టు తీర్పు
గుత్తి: పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో జరిగిన చిట్టెం విజయభాస్కార్‌రెడ్డి హత్య కేసులో ఇద్దరు ముద్దాయిలకు జీవిత ఖైదు పడింది. మరో ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష, ఇంకో ఇద్దరికి జరిమానా విధిస్తూ గుత్తి ఏడీజే కోర్టు న్యాయమూర్తి కబర్ది సంచలన తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి. అప్పేచర్ల గ్రామానికి చెందిన విజయభాస్కర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), జేసీ దివాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, టీడీపీ సీనియర్ నాయకుడు అయిన తిమ్మాపురం వెంకటేష్‌కు మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఉంది. ఏ ఎన్నికలు జరిగినా విజయభ్కార్‌రెడ్డి వర్గీయులే విజయం సాధిస్తూ వచ్చేవారు. ఈ క్రమంలో కిష్టిపాడు సింగిల్‌విండో ప్రెసిడెంట్‌గా విజయభాస్కర్ గెలుపొందారు. ఇది రాజకీయ ప్రత్యర్థి అయిన తిమ్మాపురం వెంకటేష్‌కు మింగుడు పడలేదు. విజయభాస్కర్‌రెడ్డిని అంతమొందిస్తేనే తనకు రాజకీయ ఉనికి ఉంటుందని భావించాడు. ఎలాగైనా విజయభాస్కర్‌రెడ్డిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో 2015 మార్చి 31న కిష్టిపాడు సింగిల్‌విండో కార్యాలయానికి తిమ్మాపురం వెంకటేష్‌తో పాటు అప్పేచెర్లకు చెందిన పలువురు చేరుకుని, తలుపులు మూసి విజయభాస్కర్‌రెడ్డిని అతి దారుణంగా హత్య చేశారు. హతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 16 మందిపై పెద్దవడుగూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. సదరు కేసు పలు విచారణల అనంతరం గుత్తి ఏడీజే కోర్టులో తుది విచారణకు వచ్చింది. చార్జ్‌షీట్ పరిశీలన, సాక్షుల విచారణ అనంతరం ముద్దాయిలైన ఏ2 పి.గురుప్రసాద్, ఏ4 గుర్రం శ్రీనివాసనాయుడుకు జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా, ఏ6 గుర్రం సుధాకర్, ఏ9 గుర్రం శేషాచలపతినాయుడుకు ఒక్కొక్కరికీ ఆరు మాసాల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా, ఏ10 గుర్రం రమణ, ఏ13 గుర్రం వెంకటరమణకు ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధిస్తూ ఏడీజే కబర్ది బుధవారం తీర్పు వెలువరించారు. కేసులో ఏ–1 నిందితుడు వెంకటేష్ అజ్ఞాతంలో ఉన్నాడు. మిగిలిన తొమ్మిది మంది నిందితులు చంద్రశేఖర్‌నాయుడు, రమేష్‌నాయుడు, పెద్ద శివశంకర్, మల్లికార్జున, నెల్లూరు రామకృష్ణచౌదరి, నెల్లూరు చౌడప్ప, గుర్రం శ్రీధర్, గుర్రం ప్రభాకర్‌నాయుడు, గుర్రం గోపాల్‌ను నిర్దోషులుగా తేల్చారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బుసా సుధీర్‌రెడ్డి వాదించారు. గుంతకల్లు డీఎస్పీ నరసింగప్పతో పాటు డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో భారీ భద్రత మధ్య ముద్దాయిలను కడప జైలుకు తరలించారు.
అప్పేచర్లలో గట్టి బందోబస్తు
పెద్దవడుగూరు : క్రిష్టిపాడు సింగిల్‌విండో అధ్యక్షుడు చిట్టెం విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో ముద్దాయిలకు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో విజయభాస్కర్‌రెడ్డి స్వగ్రామం అప్పేచర్లలో బుధవారం ముందస్తు చర్యల్లో భాగంగా తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. 30 మంది కానిస్టేబుళ్లు, నలుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు బందోబస్తు విధుల్లో ఉన్నట్లు స్థానిక ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదని ఇరు వర్గాల వారిని హెచ్చరించినట్లు చెప్పారు.

హత్యకు గురైన విజయభాస్కర్‌రెడ్డి (ఫైల్)