
మాట్లాడుతున్న డీఈఓ ఎం.సాయిరామ్
రాప్తాడురూరల్: పదో తరగతి పరీక్షల నిర్వహణ విధులకు నియమించిన ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండదని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎం.సాయిరామ్ తెలిపారు. నియమించిన వారంతా విధిగా విధులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామని చెప్పారు. మంగళవారం అనంతపురంలోని కేఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్‌తో కలిసి డీఈఓ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 35,305 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. వీరిలో 18,906 మంది బాలురు, 16,399 మంది బాలికలు ఉన్నారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 5,375 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,328 మంది ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 139 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 79, ప్రైవేట్‌స్కూళ్లలో 60 కేంద్రాలు ఉన్నాయన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయిందన్నారు. వారికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. వారికి సీఎస్, డీఓలు శిక్షణ ఇస్తారన్నారు. గతేడాది పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట్ల సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఏ స్థాయి అధికారికీ మొబైల్ అనుమతి ఉండదని తెలిపారు. అన్ని కేంద్రాల్లోనూ తాగునీరు, నీటి వసతి కల్గిన మరుగుదొడ్లు, ఫర్నీచరు, కరెంటు సదుపాయం ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో పని చేసి జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా చూడాలని కోరారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
పరీక్షల కోసం అనంతపురం కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని డీఈఓ తెలిపారు. ఈ కంట్రోల్ రూం 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏ చిన్న సమస్య ఉన్నా 86391 85929, 86399 31155 నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చన్నారు.
నియమించిన వారంతా విధులకు రావాల్సిందే
పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : డీఈఓ ఎం.సాయిరామ్