
మాట్లాడుతున్న పసుపుల నరసింహగౌడ్
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వ ప్రోత్సాహంతో కాపర్ల సంక్షేమానికి కృషి చేస్తామని గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాల సమాఖ్య (షీప్ అండ్ గోట్ జిల్లా యూనియన్) త్రీమెన్ కమిటీ చైర్మన్ పసుపుల నరసింహగౌడ్ తెలిపారు. మంగళవారం స్థానిక పశుశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న యూనియన్ కార్యాలయంలో పశుశాఖ గొర్రెల అభివృద్ధి విభాగం ఏడీ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి అధ్యక్షతన వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహగౌడ్ మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కాపర్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు కట్టుబడిందన్నారు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) ద్వారా మరింత ఎక్కువగా రుణాలు మంజూరయ్యేలా చూస్తామని తెలిపారు. ఇప్పటివరకు తీసుకున్న ఎన్‌సీడీసీ రుణాలకు సంబంధించి రికవరీలు పెంచితే భవిష్యత్తులో ఎక్కువ మొత్తంలో మంజూరవుతాయన్నారు. సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని, ప్రభుత్వం వివిధ రకాల వ్యాధుల నివారణకు అమలు చేస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ల కార్యక్రమాలను సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు చాలా మంది సభ్యులు ఆసక్తి చూపగా, ఎన్నికలు జరిగే దాకా త్రీమెన్ కమిటీకి సహకరించాలని కోరారు. త్రీమెన్ కమిటీ సభ్యులు పి.ఈశ్వరయ్య, బి.కిష్టప్ప, డాక్టర్ గోల్డ్స్‌మెన్ తదితరులు పాల్గొన్నారు.