
సర్వేయర్ రహబాషాను విచారిస్తున్న డీఐ వేణుగోపాల్ గుప్తా
కూడేరు: మండల సర్వేయర్ రహబాషా అక్రమాలపై కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సర్వేయర్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెళ్లడంతో 2022 డిసెంబర్ 30న రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ సస్పెండ్ చేసిన విషయం విదితమే. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ తన కుమారుల పేరిట ఇప్పేరు పొలం సర్వే నంబర్ 700–1లో 3–50 సెంట్ల అసైన్డ్ భూమిని రిజ్వాన్ పేరిట, కలగళ్లలో సర్వేనంబర్ 356–28లో 5 ఎకరాల అసైన్డ్ భూమిని ఖలీల్ అహమ్మద్ పేరిట చేయించుకున్నాడన్న ఫిర్యాదులపై ఆయా గ్రామాల వీర్వోలు రవికాంత్, సేతు మాధవ్‌లను డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ (డీఐ) వేణుగోపాల్ గుప్తా, సూపరింటెండెంట్ అయూబ్ ఖాన్‌లు విచారించారు. రెవెన్యూ రికార్డుల్లో ఆ పేర్ల మీదే భూమి ఉన్నట్లు వీఆర్వోలు వివరించారు. రాజేష్, మరికొంత మంది సర్వేయర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ అందుకు సంబంధించి ఆధారాలను పేపర్ మూలకంగా, వీడియోల రూపంలో అందజేశారు. విచారణాధికారులు వాటిని నమోదు చేసుకొన్నారు. అసైన్డ్ భూమి ఏవిధంగా పొందారో సర్వేయర్ కుమారులతో విచారించారు. చివరగా సర్వేయర్‌తో విచారణ జరిపి వివరాలు నమోదు చేసుకొన్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ వివరాలను నివేదిక రూపంలో రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌కు పంపుతామన్నారు. ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు.