
హంపాపురం బీసీ వసతి గృహంలో విద్యార్థులు
అనంతపురం రూరల్: వసతి గృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేకంగా ట్యూటర్లను సైతం నియమించింది. నెలకు ఒక్కో సబ్జ్‌క్టుకు రూ. 1,500 చెల్లిస్తోంది.
వార్డెన్ల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
ప్రభుత్వం ఇంత చేస్తున్నా కొంతమంది అధికారులు సర్కారు ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థులు ఎలా పోతే మాకేంటి, మమ్మల్ని అడిగే వారెవరన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతేడాది వసతి గృహాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు సాధించిన ఉతీర్ణత శాతంలో అనంతపురం జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారైనా అప్రమత్తంగా ఉంటున్నారా అంటే లేదనే సమాధానమే వస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెంచాల్సిందేనని ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా చాలామంది వార్డెన్లు ఆదేశాలను బేఖాతరు చేస్తూనే ఉన్నారు. పరీక్షలు సమీపిస్తున్నా చాలా హాస్టళ్లలో స్టడీ అవర్స్ నిర్వహించడం లేదు. నిబంధనల ప్రకారం వార్డెన్లు స్థానికంగా ఉండటంతో పాటు ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకూ హాస్టల్‌లోనే ఉండి స్టడీ అవర్స్ నిర్వహిస్తూ విద్యార్థులను పర్యవేక్షించాల్సి ఉన్నా చాలా మంది డుమ్మా కొడుతున్నారు. హాస్టళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పర్యవేక్షించాల్సిన ఏబీసీడబ్యూఓలు, ఏఎస్‌డబ్యూఓలు వార్డెన్లు ఇచ్చే నెలవారీ మామూళ్లకు అలవాటు పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఉతీర్ణత శాతం తగ్గితే చర్యలు
పదిలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. అన్ని హాస్టళ్లలో స్టడీ అవర్స్ నిర్వహించడంతో పాటు ట్యూటర్లను నియమించాం. ఈ సారి ఉతీర్ణత శాతం తగ్గితే వార్డెన్లు, ఏఎస్‌డబ్యూఓలపై చర్యలు తప్పవు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంక్రిమెంట్లు నిలిపివేయడంతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ప్రతి వార్డెన్ స్థానికంగా నివాసం ఉండటంతో పాటు సమయపాలన పాటించాల్సిందే.
– విశ్వమోహన్‌రెడ్డి, డీడీ,
సాంఘిక సంక్షేమశాఖ
ప్రభుత్వ వసతి గృహాల్లో ఏటా తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం
వార్డెన్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు

