
క్రేన్‌తో బ్లాక్ కార్బన్ ముడిసరుకును పక్కకు తరలిస్తున్న దృశ్యం
తాడిపత్రి: కార్బన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.50 లక్షల దాకా నష్టం వాటిల్లింది. పరిశ్రమ యజమాని కిరణ్‌కుమార్, సూపర్‌వైజర్ రామ్మోహన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అయ్యవారిపల్లి సమీపంలోని శ్రీ ప్రసన్న ట్రేడర్స్ పరిశ్రమలో బ్లాక్ కార్బన్ ముడి సరుకు నుండి పౌడర్ తయారు చేసి, అల్ట్రాటెక్‌తో పాటు ఇతర సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేస్తుంటారు. పరిశ్రమలో ఓ చోట నిల్వ ఉంచిన ముడి సరుకు మీదుగా వెళ్లిన విద్యుత్ తీగలు సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలికి ఒకదానికొకటి తగులుకున్నాయి. ఈ క్రమంలో తీగల నుంచి నిప్పురవ్వలు ఎగిసి బ్లాక్ కార్బన్ ముడిసరుకుపై పడటంతో మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే అగ్నికీలలు ఎగసిపడటంతో సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు చెందిన ఫైరింజన్‌తో పాటు తాడిపత్రి నుంచి ఫైర్ ఎస్‌ఐ మోహన్‌బాబు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజిన్‌తో ప్రమాదస్థలికి చేరుకున్నారు. దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
గాలికి విద్యుత్ తీగల రాపిడి
అగ్గిరవ్వలు పడి బ్లాక్ కార్బన్ ముడిసరుకు దగ్ధం
రూ.50 లక్షల నష్టం వాటిల్లిందంటున్న బాధితులు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే..
బ్లాక్ కార్బన్ ముడి సరుకును వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించి, ఇక్కడ ముడి సరుకును చిన్నచిన్న ముక్కలుగా ప్రాసెస్ చేసి, సిమెంట్ పరిశ్రమల్లో వాడే బొగ్గుతో కలిపి వీటిని మండించేందుకు వాడతారు. అయితే ట్రేడర్స్ పరిధి స్థలంలో ఉన్న విద్యుత్ తీగలు సరిగా లేవని విద్యుత్ అధికారులకు తెలిపాం. వారు మరమ్మతులు చేసి ఉంటే అగ్ని ప్రమాదం జరిగేది కాదు. రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది.
– కిరణ్ కుమార్, యజమాని,
శ్రీ ప్రసన్న ట్రేడర్స్