
● ‘సీమ’కే తలమానికం జేఎన్‌టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాల
● నేటి నుంచి రెండు రోజులపాటు 77వ వార్షికోత్సవాలు
అనంతపురం: రాయలసీమకే తలమానికం.. ఎంతో మంది ప్రతిభావంతులను సాంకేతిక నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దిన విద్యానిలయం. అదే జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల. ఇక్కడ చదివిన ఎందరో విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. పలువురు సొంతంగా కంపెనీలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల 77వ వార్షికోత్సవ వేడుకలు మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు అట్టహాసంగా జరగనున్నాయి. ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన హాజరుకానున్నారు.
అ‘పూర్వ’ ఘట్టాలెన్నో...
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జేన్‌టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థే. 1964లో బీటెక్ మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందారు. టైఫాయిడ్ కారణంగా ఇంజినీరింగ్ కోర్సును మధ్యలోనే ఆపేసి నెల్లూరుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత గాయకుడిగా జగద్విఖ్యాతి గాంచారు. అందుకే తన పూర్వ విద్యార్థి అయిన బాలసుబ్రహ్మణ్యంకు జేఎన్‌టీయూ(ఏ) సుమున్నతంగా సత్కరించింది. 2010లో గౌరవ డాక్టరేట్‌ను అందించింది.
● యూపీఎస్సీ మాజీ సభ్యుడు, జేఎన్‌టీయూ హైదరాబాద్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) మాజీ వీసీ ప్రొఫెసర్ వై.వెంకట్రామిరెడ్డి 1968–72 బ్యాచ్‌లో బీటెక్ (ఈసీఈ) ఇక్కడే చదివారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు రెండు దఫాలు వీసీగా పనిచేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా విధులు నిర్వర్తించి, యూపీఎస్సీ సభ్యులుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. జేఎన్‌టీయూఏ 12వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను అందించారు.
● 1980–84లో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేసిన జి.సతీష్‌రెడ్డి 1986లో డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబోరేటరీ)లో చేరారు. 2014లో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తగా ఎన్నో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. 2018లో డీఆర్‌డీఓ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అస్త్ర, ఆకాశ్, యాంటీ–రేడియేషన్ మిస్సైల్, స్మార్ట్ ఎయిర్ ఫీల్డ్ వెపన్స్ ఆవిష్కరణల్లో కీలక పాత్ర పోషించారు.
● 1960–64లో గల్లా రామచంద్రనాయుడు బీటెక్ ( ఈఈఈ) పూర్తి చేశారు. 2008లో జేఎన్‌టీయూ అనంతపురం నుంచి డాక్టరేట్ పొందారు. అమరరాజా ఫ్యాక్టరీని స్థాపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.
● జేఎన్‌టీయూ అనంతపురం ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన ఈ కళాశాల విద్యార్థే కావడం విశేషం. 1983–87లో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన ఆయన 1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం పలు హోదాల్లో పనిచేశారు. ఏపీపీఎస్సీ సభ్యులుగా పనిచేసిన ఆయన 2021 జనవరి 15న జేఎన్‌టీయూఏ వీసీగా నియమితులయ్యారు.
● జేఎన్‌టీయూ అనంతపురం రెక్టార్ ప్రొఫెసర్ ఎం.విజయకుమార్ ఇదే యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
● జేఎన్‌టీయూ అనంతపురం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి. శశిధర్ ఎంటెక్, పీహెచ్‌డీ ఇక్కడే పూర్తి చేశారు.
● ప్రస్తుత క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.సుజాత జేన్‌టీయూ అనంతపురం 1989–93 మధ్య బీటెక్, తర్వాత ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. తాను చదివిన కళాశాలకే ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కళాశాల ఏర్పడిందిలా..
రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో 1945లో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. మద్రాసు గిండిలో తరగతులు నిర్వహించారు. అనంతరం 1946లో అనంతపురంలో తరగతులు నిర్వహించారు. యుద్ధఖైదీలు ఉండే బ్యారక్స్‌లో తరగతులు ప్రారంభమయ్యాయి. అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి ఓ.రంగస్వామి రెడ్డియార్ జేఎన్‌టీయూ కళాశాల క్యాంపస్‌కు 300 ఎకరాలు కేటాయించారు. 1958లో కళాశాల మెయిన్ భవనాన్ని రూ.18 లక్షలతో నిర్మించారు. ఇందులో మూడు ల్యాబోరేటరీలు, ఒక వర్క్‌షాప్, బ్లాక్ అండ్ పవర్ హౌస్ ఉండేవి. 1946 నుంచి 1955 వరకు మద్రాసు వర్సిటీకి అనుబంధంగా కళాశాల కొనసాగేది. 1955–1972 వరకు ఎస్వీ యూనివర్సిటీ అనుబంధంగా ఉంది. తర్వాత జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలోకి వెళ్లింది.
వైఎస్సార్ చలువతో యూనివర్సిటీగా..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్ కళాశాలను యూనివర్సిటీగా మార్చారు. రాయలసీమ జిల్లాలతో పాటు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలను యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చారు. రాయలసీమలో సాంకేతిక విద్యను అందించే దిశగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్సిటీ మార్పు చేయడంతో లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు చదవడానికి ఆస్కారం ఏర్పడింది.
పూర్వ విద్యార్థుల చేయూత
తాము చదివిన ఇంజినీరింగ్ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేయూతనందిస్తున్నారు. ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి దోహదపడ్డ కళాశాలకు దన్నుగా నిలవాలనే ఉద్దేశంతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటిదాకా రూ.69 లక్షలను నేరుగా చెక్కుల రూపంలో విరాళాలు అందించారు. శిల్పా హాస్టల్ మరమ్మతులకు రూ.4.5 లక్షలు అందజేశారు.
పూర్వ జన్మ సుకృతం
నేను ఇదే కళాశాలలో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తిచేశాను. ప్రస్తుతం వీసీ హోదాలో విధులు నిర్వర్తిస్తుండడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. పూర్వ విద్యార్థులు సహకారం అందిస్తుండడం ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తున్నాం.
– ప్రొఫెసర్ జింకా రంగజనార్దన,
వీసీ, జేఎన్‌టీయూ అనంతపురం
