
వినతులు స్వీకరిస్తున్న ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: చట్టపరిధిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 141 వినతులు అందాయి. ఎస్పీ స్వయంగా అర్జీలు స్వీకరించి, సమస్య తీవ్రతపై బాధితులతో ఆరా తీశారు. అనంతరం సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కాగా, తనకు భర్త నుంచి ప్రాణహాని ఉందంటూ గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన అంజూమ్... ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేసింది. కొద్ది రోజుల క్రితం గుత్తి ఆర్‌ఎస్‌లోని రియాజ్ బాషాతో వివాహమైందని, కట్న కానుకల కింద రూ.25 లక్షల విలువైన బంగరాన్ని అందజేశారని గుర్తు చేసింది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో పుట్టింటికి చేరుకున్నట్లు తెలిపింది. ఘటనకు సంబంధించి గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవడం లేదని వాపోయింది. స్పందించిన ఎస్పీ వెంటనే గుత్తి పోలీసులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత యువతి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు పాల్గొన్నారు.