దాహార్తి ఎరుగని అనంత

కంబదూరు చెరువు కింద సాగైన వరి పంట  - Sakshi

అనంతపురం సెంట్రల్‌: రాయలచెరువు, వైటీ చెరువు, పాతకొత్త చెరువు, నాగసముద్రం, చోళసముద్రం.. ఊర్ల పేర్లలో సముద్రాలు, చెరువులకు కొదవలేకపోయినా.. అక్కడ నీళ్లు పారేది మాత్రం మనుషుల కళ్లలోనే! పాతిక ఎకరాలున్న రైతైనా.. వానలు కురవకపోతే ఇల్లూ నేలా వదిలి వలస పోవాల్సిందే. అక్షర క్రమంలో మొదటిదిగా ఉన్న అనంతపురం జిల్లా దైన్య పరిస్థితి ఇది. ఈ మూడేళ్లలో సమృద్ధిగా కురిసిన వర్షాలతో ఇక్కడి పరిస్థితుల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. దుర్భిక్షానికి మారుపేరైన అనంత జిల్లాలో కరువు ఛాయలు పూర్తిగా మటుమాయమయ్యాయి.

సీజన్‌ ఏదైనా తాగునీటికి కటకటే!

అనంతపురం జిల్లా అంటే ఠక్కున గుర్తుచ్చొది కరువు... కాటకాలు! ఒకప్పుడు సీజన్‌ ఏదైనా ఇక్కడ గుక్కెడు నీటికి కటకటలాడాలే దైన్య పరిస్థితులు ఉండేవి. వందలాది గ్రామాలకు, పట్టణాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తే ప్రజావసరాలకు అరకొ గానే సరిపోయేవి. ఇంతటి దుర్భర పరిస్థితులు 2019 తర్వాత క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి. సమృద్ధిగా కురిసిన వర్షాలకు తోడు హెచ్చెల్సీ, హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌ల ద్వారా జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. చివరకు మండు వేసవిలోనూ చెరువుల్లో నీటి మట్టం తగ్గడం లేదు. ఫలితంగా భూగర్బజలాలు గణనీయంగా పెరి గి వ్యవసాయం పండుగలా సాగుతోంది. తాగునీటి సమస్య అనేది ఎక్కడేగాని ఉత్పన్నం కావడం లేదు.

242 చెరువుల్లో పుష్కలంగా నీరు

జిల్లా వ్యాప్తంగా 301 చెరువులుండగా గత ఖరీఫ్‌లో విస్తారంగా వర్షాలు కురవడంతో దాదాపు అన్ని చెరువులూ జలకళను సంతరించుకున్నాయి. 242 చెరువుల్లో నేటికీ పుష్కలంగా నీళ్లున్నాయి. ఎండలు తీవ్ర ప్రభావం చూపే మార్చిలో సైతం చెరువుల్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టలేదు. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా చెరువుల కింద 35వేల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి.

మూడేళ్లుగా కనిపించని కరువు ఛాయలు

సమృద్ధిగా కురిసిన వర్షాలు

ప్రాజెక్టులు, కుంటలు, చెరువులకు జలకళ

మండు వేసవిలోనూ

చెరువుల్లో తగ్గని నీటి మట్టం

భూగర్భజలాల అభివృద్ధితో

సాగు, తాగునీటి ఇక్కట్లు దూరం

కంబదూరు చెరువు.. జిల్లాలోనే అతి పెద్ద చెరువుల్లో ఒక్కటిగా ఖ్యాతిగాంచిన ఈ చెరువు నీటి నిల్వ సామర్థ్యం 0.201 టీఎంసీలు. ఈ చెరువు కింద 1,100 ఎకరాల ఆయకట్టు ఉంది. అనధికారికంగా అదే స్థాయిలో భూముల్లో పంటలు సాగవుతుంటాయి. 1997 వరకు ఈ చెరువులో నీరుండేది. ఆ తర్వాత చుక్కనీరు లేక బోసిపోయింది. ఈ మూడేళ్లలో కురుస్తున్న వర్షాలకు కంబదూరు చెరువు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. పాతికేళ్ల తర్వాత ఈ ఏడాది చెరువు మరువ పారింది. మండు వేసవిలోనూ చెరువులో నీటి మట్టం తగ్గకుండా ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో పంటల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది.

వాటర్‌ ట్యాంక్‌ ద్వారా తాగునీటిని పట్టుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 2018 వరకూ పుట్లూరు మండలం గోపరాజుపల్లి వాసులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. వేసవిలోనే కాదు... ఇతర సీజన్లలోనూ ఇక్కడి వారికి ట్యాంకర్ల నీరే దిక్కు. 2019 తర్వాత వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ఈ మూడేళ్లలో పరిస్థితుల్లో సమూలంగా మార్పు చోటు చేసుకుంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్ట్‌లు జలకళను సంతరించుకోవడంతో భూగర్భ జలాలు పెరిగి ప్రజల తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. ప్రస్తుతం జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమం కింద ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నారు.

భూగర్బజలాలు అభివృద్ధి చెందాయి

జిల్లాలో ఈ ఏడాది అన్ని చెరువులకు నీళ్లు చేరాయి. వర్షాలకు తోడు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా చెరువులను నీటితో నింపాం. దీంతో భూగర్బజలాలు బాగా అభివృద్ధి చెందాయి. వేసవిలోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తడం లేదు.

– శ్రీనివాసరెడ్డి, సీఈ, జలవనరులశాఖ

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top