
కారులో సూర్యతేజ మృతదేహం
గార్లదిన్నె: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కనంపల్లి క్రాస్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన మేరకు.. హైదరాబాద్ హిమాయత్ నగర్‌కు చెందిన వెంకట సూర్యతేజ (26) ఆగ్రో కంపెనీ ఉద్యోగి. శనివారం ఉదయం బెంగళూరులో పని నిమిత్తం హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. కనంపల్లి క్రాస్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొని అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన సూర్యతేజ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న సూర్యతేజ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
కరువును తరిమేద్దాం
● ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్
అనంతపురం కల్చరల్: జిల్లాలో విరివిగా మొక్కలు నాటి సంరక్షించి కరువును తరిమేద్దామని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో శనివారం శ్రీజీ ప్రకృతి ధర్మపీఠం ట్రస్టు ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఏసీఆర్ దివాకరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పుల్లెల గోపీచంద్, ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ శ్రీనివాస్, ఏఎస్పీ హనుమంతు, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, ఆదరణ రామకృష్ణ, ఎన్‌ఆర్‌సీ కోఆర్డినేటర్ లక్ష్మీకాంత్ తదితరులు ఆత్మీయ అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటా మొక్కలు నాటితే భవిష్యత్తులో అందరికీ చల్లని నీడ లభిస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి ధర్మపీఠం ట్రస్టు కోటి వృక్ష మహోత్సవాన్ని దిగ్విజయంగా కొనసాగించడం శుభపరిణామమన్నారు. ఎప్పుడు పిలిచినా వస్తానని తెలిపారు. చెట్ల ఆవశ్యకతను డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి కవితారూపంలో చక్కగా వినిపించారు. ప్రకృతి ప్రాధాన్యతను తెలిపే ఓ పాటను లెనిన్ ఆలపించి ఆకట్టుకున్నారు.అనంతరం న్యాయవాది పద్మజ, బ్రహ్మకుమారీ సిస్టర్ శారద, వివేకానంద యోగా ట్రస్టు రాజశేఖరరెడ్డి,కోగటం విజయభాస్కరరెడ్డి, ఏఎస్పీ హనుమంతు,ఎన్‌వైకే అధికారి శ్రీనివాస్‌తో పాటు 40 మందికి ఉగాది పురస్కారాలనందించారు.
ఆరుగురు విద్యార్థుల డీబార్
అనంతపురం: డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ 6 మంది విద్యార్థులు డీబార్ అయినట్లు ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. అనంతలో నలుగురు, కదిరిలో ఇద్దరు డీబార్ అయ్యారు.

మాట్లాడుతున్న పుల్లెల గోపీచంద్