వేసవి ఆరంభంలోనే నీటి ఎద్దడి మొదలైంది. ఎండల తీవ్రత ఎక్కువగా కావడంతో జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. బోరుల్లో, నదుల్లో, బావుల్లో, చెరువుల్లో నీటి వనరులు అడుగంటాయి. ఏజెన్సీని అనుకుని ఉన్న మండలాల్లో శివారు గిరిజన గ్రామాల్లో బిందెడు నీటి కోసం 3 నుంచి 4 కిలోమీటర్ల మేర మండుటెండలో నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దాహార్తి తీర్చండి సారూ..అంటూ మొరపెట్టుకుంటున్నారు.
సాక్షి, అనకాపల్లి :
జిల్లాలో నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండల పరిధిలో ఉన్న శివారు గిరిజన గ్రామాలలో గుక్కెడు నీటి కోసం గిరిజన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో గిరిజనులంతా సొంతంగా బావి తవ్వుకున్నారు. వేసవి రావడంతో ఆ బావిలో నీళ్లు కూడా అడుగంటాయి. మరికొన్ని గిరిజన గ్రామాల్లో బురద నీరే గత్యంతరం లేని పరిస్థితుల్లో వడకట్టుకుని తాగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, గిరిజన మహిళలు బిందెలతో నిరసన తెలియజేస్తున్నారు.
చోడవరం నియోజకవర్గం...రావికమతం మండలం కొత్తకోట పంచాయతీలో దేవతమ్మవీధితో పాటు మరో రెండు కాలనీల్లో వాటర్ సమస్యతో దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా రూ.6 కోట్లు మంజూరు చేశారు. 15 రోజుల పాటు నీళ్లు ఇచ్చినా తరువాత నుంచి వాటర్ రావడం లేదు. ఆ గ్రామంలో రెండు రోజులకొకసారి స్నానాలు కూడా చేసే పరిస్థితిలో ప్రజలు లేరు. రోలుగుంట మండలంలో పలు గిరిజన గ్రామాల్లో నీటి సమస్య ప్రారంభమైంది. గొలుగొండ మండలంలో గిరిజన గ్రామాలు అనంతసాగర్, అంటిమానజోరులు, కచిమి, డొంకాడ, రాజుపేట, డోన్‌పాలెం, వడపర్తి, జమ్మవరం, పొగచొట్లపాలెం, వెంకటాపురం, నల్లంకి, పెసరాడ గ్రామాల్లో నీటి సమస్య నెలకొంది.
●పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాలకు తాగునీటి ఎద్దడి నివారణ దిశగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారుగా రూ.35 కోట్లతో మెగా ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. ఏలేరు కాలువ నుంచి నీటిని పేటకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పైపులైను ద్వారా వచ్చిన నీటిని నిల్వచేసి అక్కడ నుంచి మూడు మండలాల పరిధిలో 140 గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే దిశగా పనులు మొదలు పెట్టారు. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చి మూలన పడేసింది. 2017లో మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పనులు ప్రారంభమైనా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మూలన పడకేసింది.
●కె.కోటపాడు మండలంలో ఆనందపురం గ్రామంలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామంలో జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.30 లక్షలతో 40 వేల లీటర్ల మంచినీటి పఽథకానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీంతో మంచినీటి పఽథకం నిర్మాణంకు పనులు ప్రారంభించిన తరువాత కూటమి పార్టీల నేతలు శ్మశానవాటికలో ట్యాంక్ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు కోర్టును ఆశ్రయించి పనులు జరగకుండా అడ్డుపడ్డారు. దీంతో 3 ఏళ్లుగా మంచినీటి పథకం నిర్మాణం అసంపూర్తిగా నిలిచింది. గ్రామంలో తాత్కాలికంగా నిర్మాణం చేపట్టిన 10 వేల లీటర్ల మినీ రక్షిత మంచినీటి పథకం ద్వారానే అరకొరగా నీటిని అందిస్తున్నారు. ఆనందపురం నుంచి కె.కోటపాడు వెళ్లే మార్గంలో ఉన్న ఇళ్లకు మాత్రం నేటికీ కుళాయిల ఏర్పాటు లేదు. దీంతో సుమారు 60 కుటుంబాల వారు బోరు నీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది. వేసవికాలం కావడంతో చేతిబోర్ల వెంట నీరు అంతంత మాత్రంగానే వస్తుందని ఆయా ప్రాంతాల్లో గల మహిళలు చెబుతున్నారు. 40 వేల లీటర్ల మంచినీటి పఽథకాన్ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో గ్రామంలో కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
●మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండల పరిధిలో 55 గిరిజన గ్రామాలు ఉన్నాయి. మాడుగుల మండలంలో వాపర్తి, రాజంపేట గ్రామాల్లో 150 మంది గిరిజనులు నివాసం ఉంటారు. చీడికాడ మండలంలోని కోనాం శివారు బందవీధి గిరిజన గ్రామంలో గిరిజనులు తాగునీటి సమస్య ఉంది. దేవరాపల్లి మండలంలో చింతలపూడి పంచాయతీ మదనగరువు గ్రామంలో తాగునీటి సమస్య ఉంది.
●నాతవరం మండలంలో 31 గ్రామ పంచాయతీలో మొత్తం 457 చేతి బోర్లు 120 తాగునీటి పథకాలు ఉన్నాయి. కొండ మీద ఉన్న గిరిజన గ్రామాల్లో తాగునీటి పథకాలు నిర్మాణాలు పూర్తయినా.. ఇంటింటా కుళాయి కనెక్షన్‌లు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. సుందరకోట గిరిజన పంచాయతీలో కుళాయిలు ప్రారంభించినా కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతూనే ఉంది.
●బుచ్చెయ్యపేట మండలంలో గత ప్రభుత్వ హయాంలో 68 మంచినీటి పనులు, 26 ట్యాంకులు మంజూరు కాగా కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా సగం పనులు కూడా పూర్తి కాలేదు. గున్నెంపూడిలో మంచినీటి ట్యాంకు, పైపులైన్ పనులు పూర్తి కాకపోవడంతో తాగునీటి కష్టాలు పడుతున్నారు.
తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలి
గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్య నెలకొనడంతో వచ్చే నెలలో పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. అధికారులు తూతూ మంత్రంగా వచ్చి చూసిపోతున్నారు. రావికమతం మండలంలో మేజర్ పంచాయతీ కొత్తకోటతో పాటు జిల్లా వ్యాప్తంగా గిరిజన గ్రామాల్లో, ఇతర గ్రామాల్లో నీటి సమస్య ఉంది. అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదు.
– కె గోవిందరావు,
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు
జిల్లాలో మోగుతున్న ప్రమాద ఘంటికలు
తాగునీటి చెరువుల్లో, బావుల్లో అడుగంటిన నీటి వనరులు
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రారంభమైన తాగునీటి కష్టాలు
గుక్కెడు మంచి నీరు కోసం జనం నానాపాట్లు
గిరిజన గ్రామాల్లో 4 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి
నిర్వహణ లోపంతో అధ్వానంగా మారిన నీటి పథకాలు
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా ఆలోచన చేయని చంద్రబాబు ప్రభుత్వం
జిల్లాలో 16,059 చేతి పంపులు, 2.64 లక్షల కుళాయి కనెక్షన్లు


