రూ.3.86 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.3.86 కోట్లు

Apr 7 2026 7:37 AM | Updated on Apr 7 2026 7:37 AM

2026–27 బడ్జెట్‌లో ప్రాథమిక కేటాయింపులు కన్సాలిడేటెడ్‌ బడ్జెట్‌ను విడుదల చేసిన రైల్వే బోర్డు విశాఖ ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ సామర్థ్యం పెంపు, ఆధునికీకరణకు రూ.20.82 కోట్లు ఆటో సిగ్నలింగ్‌కు రూ.49.24 కోట్లు ట్రాక్‌ పునరుద్ధరణకు రూ.87.93 కోట్లు

‘దక్షిణ కోస్తా జోన్‌’కు

సాక్షి, విశాఖపట్నం: గత రెండు బడ్జెట్‌లతో పోలిస్తే, ఈ సారి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే కేటాయింపులు చేపట్టింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వే బోర్డు తాజాగా కన్సాలిడేటెడ్‌ బడ్జెట్‌ వివరాలను విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో పాటు, వాల్తేరు డివిజన్‌ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కేంద్రం కీలక కేటాయింపులు చేసింది. ప్రధానంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడంతో పాటు, రద్దీగా ఉండే మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వాల్తేరు డివిజన్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులు ఇక పట్టాలెక్కనున్నాయి.

కేటాయింపుల వివరాలు ఇలా..

విజయనగరం–కొత్తవలస మూడో లైన్‌: వాల్తేరు డివిజన్‌లో అత్యంత రద్దీగా ఉండే విజయనగరం–కొత్తవలస సెక్షన్‌లో 34.7 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్‌ నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో రూ.299.83 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం కూడా ఇదే కావడం విశేషం. ఈ లైన్‌ అందుబాటులోకి వస్తే సరకు రవాణా రైళ్ల వేగం పెరగడమే కాకుండా, ప్రయాణికుల రైళ్ల ఆలస్యానికి చెక్‌ పడనుంది.

విశాఖ స్టేషన్‌ ఆధునికీకరణ, భద్రత: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ పరిధిలో భద్రతను మెరుగుపరచడానికి, రైళ్ల వేగాన్ని పెంచడానికి ‘ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌’వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.49.24 కోట్లు కేటాయించారు. దీని వల్ల స్టేషన్‌ పరిధిలో రైళ్ల రాకపోకల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.

ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ విస్తరణ: దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, విశాఖ నుంచి నడిచే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం 200 ఇంజిన్ల సామర్థ్యం ఉన్న విశాఖ ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ను 225కు పెంచనున్నారు. ఈ పనుల కోసం రూ.20.82 కోట్లు కేటాయించారు. దీనివల్ల ఇంజిన్ల నిర్వహణ మరింత సులభతరం కానుంది.

జోన్‌ ప్రధాన కార్యాలయానికి నిధులు

చాలా కాలంగా ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి బడ్జెట్‌లో చేయూత లభించింది. జోనల్‌ కార్యాలయ భవన నిర్మాణం, ప్రహరీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం రూ.3.86 కోట్లు కేటాయించారు.

మరికొన్ని..

●పలాస–విశాఖపట్నం–దువ్వాడ సెక్షన్‌లో సుమారు 72 కిలోమీటర్ల మేర ట్రాక్‌ ఆధునికీకరణ పనులకు రూ.87.93 కోట్లు కేటాయించారు. ఇది రైళ్ల ప్రయాణ వేగాన్ని పెంచడానికి దోహదపడుతుంది.

●వాల్తేరు డివిజన్‌ పరిధిలోని వివిధ స్టేషన్లలో పాత సిగ్నలింగ్‌ వ్యవస్థ మార్పునకు రూ.31.26 కోట్లు, ఎఫ్‌అండ్‌ జీ క్యాబిన్ల ఆధునికీకరణకు రూ.27.41 కోట్లు కేటాయించారు.

●విశాఖ కోచింగ్‌ డిపోలో రన్నింగ్‌ రూమ్‌, క్రూ లాబీ అప్‌గ్రెడేషన్‌ కోసం రూ.4.90 కోట్లు కేటాయించారు.

●విశాఖపట్నం న్యూ గూడ్స్‌ కాంప్లెక్స్‌ వద్ద సౌకర్యాల మెరుగుదలకు రూ.21.84 కోట్లు కేటాయించారు. ఇది సరకు రవాణా ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement