‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
దేవరాపల్లి: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం సూచించిన వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని జిల్లా అకడమిక్ మోనటరింగ్ కమిటీ సభ్యులు ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని కలిగొట్ల, తెనుగుపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను గురువారం వారు సందర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు జిల్లా అకడమిక్ మోనటరింగ్ కమిటీ ఇన్‌చార్జి వి.శేషగిరిరావు, సభ్యులు కె.అప్పలరాజు, టి.వి.ఎస్. ప్రసాద్, ఎన్.వి.ఎస్. సోమయాజులు, వై. ఈశ్వరరెడ్డి, ఎం. కామేశ్వరరావు, ఎల్. బాబూరావు, పి.వి.జి.ఎన్. గంగాధర్ తదితరులు పదో తరగతికి అమలవుతున్న వంద రోజుల ప్రణాళికను పరిశీలించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షించారు. నోట్ బుక్స్, అసెస్మెంట్ రిజిస్టర్లు, రోజువారీ జరుగుతున్న స్లిప్ టెస్టులను పరిశీలించి, ఫలితాల సగటును పర్యవేక్షించారు. పదో తరగతి విద్యార్థుల్లో రైజింగ్ స్టార్స్(వెనుకబడిన విద్యార్థులు)లను షైనింగ్ స్టార్స్ మార్చేందుకు ఉపాధ్యాయులు చేపడుతున్న కార్యాచరణ ప్రణాళికలపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సలహాలు, సూచనలు చేశారు.


