పేరు మార్చి..సేవలు నీరుగార్చి
గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ అన్నదాతలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా విత్తనం నుంచి విక్రయం దాకా సేవలందించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (రైతు సేవా కేంద్రాలు)ను నిస్తేజం చేసి, ఊపిరి తీసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలు కొనసాగిస్తోంది. రేషనలైజేషన్ పేరిట వీటికి మంగళం పాడేందుకు చర్యలు చేపట్టింది. రైతులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వారికి నిరాశే మిగులుస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించవలసిన సాగు సలహాలు,సేవలు, ఎరువులు, విత్తనాలను అందకుండా చేస్తోంది.
సాక్షి, అనకాపల్లి:
దేశానికే రోల్ మోడల్‌గా గుర్తింపు పొందిన రైతు భరోసా కేంద్రాలు (ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలు) చాలా ప్రాంతాల్లో కనుమరుగయ్యాయి. ఉన్న ఊర్లో రైతులకు అన్ని రకాల సేవలను అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీటిని ఏర్పాటు చేశారు. ఇవి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలతో పాటు సాగుకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు అడుగడుగునా అండగా నిలిచేవి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. అక్కడతో ఆగకుండా ఆ సేవలకు మంగళం పాడేందుకు కంకణం కట్టుకుంది. రేషనలైజేషన్ పేరుతో భారీ సంఖ్యలో రైతు సేవా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. అందులో పనిచేసే సిబ్బందిని కూడా కుదించేసి..ప్రమోషన్ల పేరిట, కొత్త నియామక ప్రక్రియ లేకుండా మూసివేసే దిశగా ఆడుగులు వేస్తోందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నాయి.
160 కేంద్రాలకు మంగళం
ప్రతీ వెయ్యి ఎకరాలకు ఒక రైతు సేవా కేంద్రంగా కుదించారు. జిల్లాలో 450 రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. రేషనలైజేషన్ పేరుతో రెండు, మూడు రైతు సేవా కేంద్రాలకు ఒకటిగా సర్దుబాటు చేశారు. దీంతో వీటి సంఖ్య 290కి తగ్గిపోయింది. అంటే 160 రైతు సేవాకేంద్రాల్లో సేవలకు మంగళం పాడారు. వీటిలో 290 మంది విలేజ్ అగ్రికల్చర్ ఆసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతోపాటు విలేజ్ సెరికల్చర్ సిబ్బంది పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నారు.
సేవలు నిర్వీర్యం..
చంద్రబాబు సర్కర్‌లో రైతు సేవా కేంద్రాలతో పాటు అందులో రైతు కోసం ఏర్పాటు చేసిన కియోస్కో కేంద్రాలు కూడా మూలన పడ్డాయి. ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాల్లో నకిలీవి పంపిణీ చేయడంతో గత ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రైతులకు మేలు జరిగేలా..అధిక దిగుబడి కల్పించేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అగ్రి ల్యాబ్స్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం వాటినీ నిర్వీర్యం చేసింది. ఉచిత పంట బీమా లేదు..గత ఖరీఫ్ సీజన్‌లో మోంథా తుపాను కారణంగా భారీగా పంట నష్టం జరిగింది. బాధిత రైతులకు ఇప్పటివరకూ నష్ట పరిహారం అందలేదు.
26 వేల మందికి పెట్టుబడి సాయం ఎగవేత..
రైతులకు రెండేళ్లగా ఖరీఫ్ సీజన్‌లో కష్టాలు..కన్నీళ్లే మిగిలాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత తొలి ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం అందలేదు. రెండో ఏడాది అరకొరగానే సాయం అందించారు. 26,207 మంది రైతులకు ఎగనామం పెట్టారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఒక్కో ఏడాదికి గానూ వైఎస్సార్ రైతుభరోసా కింద 2,65,778 మంది లబ్ధిదారులకు రూ.304.43 కోట్లు పెట్టుబడి సాయం అందించింది. కూటమి ప్రభుత్వంలో 2,39,571 మాత్రమే ఇచ్చారు.
మూలకు చేరిన కియోస్కో
దేవరాపల్లిలో మూతపడిన రైతు సేవా కేంద్రం–1
ఆర్బీకేలపై కొనసాగుతున్న
చంద్రబాబు కుట్రలు
జిల్లాలో 160 కేంద్రాలకు మంగళం
రేషనలైజేషన్ పేరిట సిబ్బంది సర్దుబాటు
కొన్ని చోట్ల రెండు సచివాలయాలకు ఒకే అగ్రికల్చర్ అసిస్టెంట్
మూలన పడిన కియోస్క్ యంత్రాలు
ఆందోళనలో అన్నదాతలు
కౌలు రైతులకూ కష్టాలే..
చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి కౌలు రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. రెండేళ్ల పాటు కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. జిల్లా వ్యాప్తంగా 9వేలకు పైగా కౌలు రైతులుంటే.. 4,285 మంది కౌలు రైతులనే వ్యవసాయ శాఖ గుర్తించింది. వారికి కూడా అన్నదాత సుఖీభవ అందించలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 9,173 మంది కౌలు రైతుల లక్ష్యం కాగా, 5 వేలకు పైగా రైతులకు సాగు హక్కు కార్డులు అందించారు. ఒక్కొక్కరికీ రూ.13,500 చొప్పున నాలుగు ఏళ్ల పాటు రూ.54 వేలు పెట్టుబడి సాయం అందజేశారు.
పేరు మార్చి..సేవలు నీరుగార్చి
పేరు మార్చి..సేవలు నీరుగార్చి


