మాటల తీపితో మరోసారి నమ్మించి.. | - | Sakshi
Sakshi News home page

మాటల తీపితో మరోసారి నమ్మించి..

Jan 25 2026 7:10 AM | Updated on Jan 25 2026 7:10 AM

మాటల తీపితో మరోసారి నమ్మించి..

మాటల తీపితో మరోసారి నమ్మించి..

చోడవరం: గోవాడ సుగర్స్‌ రైతులు రిలేదీక్షలు ప్రారంభించి 23రోజులకు తీరిగ్గా స్పందించి శిబిరం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు పాతపాటే పాడి, మరోసారి నమ్మించి శనివారం ఉద్యమాన్ని విరమింపజేశారు. తమను గెలిపిస్తే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోవాడ సుగర్‌ఫ్యాక్టరీని అభివృద్ధి చేయడంతోపాటు చెరకు రైతులకు టన్నుకు రూ. 4వేలు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన వీరిద్దరూ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఏడాదిన్నరగా చెరకు బకాయిలు రాక , ఈఏడాది ఫ్యాక్టరీ క్రషింగ్‌ నిలిపివేయడంతో పండించిన చెరకును ఏం చేయాలో అర్థంకాక రైతులు, ఆరునెలలుగా జీతాలు లేక కార్మికులు తీవ్ర ఆవేదనతో కొద్ది నెలలుగా ఫ్యాక్టరీ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. అయినా చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌. రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పట్టించుకోలేదు. దీంతో రిలే దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులూ ఇదే రోడ్డుపై రోజూ తిరిగే వీరిద్దరూ ఆ టెంటు వైపు గాని, ఫ్యాక్టరీ సమస్య వైపుగాని కన్నెత్తయినా చూడలేదు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుండడంతో సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఎలాగైనా రైతులు, కార్మికుల ఆందోళనను విర మింపజేయాలని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది.

వస్తున్నామంటూ హడావుడి

దీంతో ఎమ్మెల్యేలు ఆగమేఘాల మీద ఉద్యమం చేస్తున్న నిర్వాహకులకు ఫోన్లు చేసి మైకుసెట్లు పెట్టండి, రైతులందర్నీ పోగుచేయండి.. మేమొస్తున్నామంటూ హడావుడి చేశారు. టెంటు దగ్గర పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కార్మికులకు రావలసిన రూ. 8 కోట్లు జీతాలు త్వరలో ఏదో రూపంలో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన ఎమ్మెల్యేలు, చెరకు రైతులకు చెల్లించాల్సిన రూ. 28కోట్లు బకాయిలు, ఫ్యాక్టరీ క్రషింగ్‌ ప్రారంభంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. రైతుల పేమెంట్స్‌కు ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలి కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళతామని చెప్పారు. చక్కెర పరిశ్రమ నష్టాల్లో ఉండటం వల్ల గోవాడ ఫ్యాక్టరీలో క్రషింగ్‌ చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఇథనాయిల్‌, డిస్టలరీల్లో ఏ పరిశ్రమగా ఈ ఫ్యాక్టరీని మార్చి ఎలా అభివృద్ధి చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ఈ మాటలన్నీ గత ఏడాదిన్నరగా మీరు చెబుతున్నవే, గత ప్రభుత్వం మాదిరిగా మీరు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని కొందరు రైతులు ప్రశ్నించగా వారి నొరునొక్కే ప్రయత్నం ఎమ్మెల్యే బండారు చేశారు. అంతేకాకుండా తన అనుచరులతో వారిపై మాటలతో ఎదురుదాడి చేయించారు. దీక్షలో కూర్చున్న రైతులు, రైతు సంఘాల నాయకులు, కార్మికులకు నిమ్మరసం ఇచ్చి శిబిరాన్ని ఎత్తివేయించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

హామీ నెరవేర్చకుంటే మళ్లీ ఆందోళన

ఎమ్మెల్యేలిద్దరూ ఇచ్చిన హామీ త్వరలో నెరవేరకపోతే మళ్లీ ఉద్యమానికి దిగుతామని రైతు, కార్మిక సంఘాలు హెచ్చరించాయి. దీక్ష విరమించిన తరువాత ఆ నాయకులు విలేకరులతో మాట్లాడారు. గతంలో వీరు హామీలు ఇచ్చారుకానీ నెరవేర్చలేదని, ఇప్పుడు వారి మాటకు గౌరవమిచ్చి విరమిస్తున్నామని, మాట ప్రకారం రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనిహెచ్చరించారు. సీపీఐ, రైతు కూలీసంఘం, చెరకు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సుగర్‌ ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

గోవాడ సుగర్స్‌ రైతులతో దీక్షను

విరమింపజేసిన ఎమ్మెల్యేలు

దీక్షలు ప్రారంభించి 23రోజులకు

స్పందించిన ప్రజాప్రతినిధులు

హామీలు నెరవేర్చకపోతే ఉద్యమానికి

దిగుతామని హెచ్చరించిన రైతు,

కార్మిక సంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement