అడవే కదా.. అడిగేదెవరు..! | - | Sakshi
Sakshi News home page

అడవే కదా.. అడిగేదెవరు..!

Jan 20 2026 8:01 AM | Updated on Jan 20 2026 8:01 AM

అడవే

అడవే కదా.. అడిగేదెవరు..!

యథేచ్ఛగా అటవీ సంపద దోపిడీ

సీతపాలెం షెల్టర్‌ బెల్ట్‌ ప్రాంతంలో సరుగుడు చెట్ల నరికివేత

వ్యాన్లలో అనకాపల్లికి తరలిస్తున్న అక్రమార్కులు

దందా వెనుక టీడీపీ నేతలు?

మంత్రి, జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులకు ఫిర్యాదు

అడవే కదా..అడిగేదెవరు..అడ్డుకునేదెవరూ! అన్నట్టు ఉంది అక్రమార్కుల తీరు. అటవీ విస్తీర్ణం పెంచేందుకు, తీర ప్రాంతంలో పెనుగాలుల నుంచి రక్షణ కోసం పెంచుతున్న చెట్లపై అక్రమార్కుల కన్ను పడడంతో వాటిని యథేచ్ఛగా నరికివేసి విలువైన కలప అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అప్పుడప్పుడు అధికారుల దాడుల్లో కలప పట్టుబడుతున్నా స్వల్ప చర్యలతో వదిలేస్తుండడంతో ఈ అక్రమానికి అడ్డుకట్ట పడడం లేదు. ఈ దందా వెనుక కొందరు టీడీపీ నేతల హస్తం ఉండడంతో అధికారులు కఠిన చర్యలకు వెనుకాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యలమంచిలి రూరల్‌ :

లమంచిలి అటవీ పరిధి సీతపాలెం షెల్టర్‌బెల్ట్‌ ప్రాంతంలో పెరుగుతున్న సరుగుడు చెట్లను స్థానికంగా ఉన్న కొందరు టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి దర్జాగా నరికివేస్తున్నారు. నరికివేసిన దుంగలను రాత్రికి రాత్రే అనకాపల్లిలో కలప డిపోలకు తరలించి అమ్ముకుంటున్నారు. అటవీ అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది కొరత, ఉదాసీనత వెరసి తీరప్రాంత రక్షణ కోసం పెరుగుతున్న చెట్లు నేలకొరుగుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం ద్వారా స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు రూ.లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారు. ఒకవేళ పొరపాటున అధికారులకు పట్టుబడినా అక్రమార్జనలో కొంత జరిమానా కట్టి తప్పించుకుంటున్నారు. మళ్లీ కలప అక్రమ రవాణాను కొనసాగిస్తూ అటవీ అధికారులకు సవాల్‌ విసురుతున్నారు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి రాంబిల్లి మండలం సీతపాలెం షెల్టర్‌బెల్ట్‌ ప్రాంతంలో పెరుగుతున్న భారీ సరుగుడు చెట్లను అక్రమార్కులు నరికివేయించారు. వాటిని దుంగలుగా చేసి వ్యాన్‌పై అనకాపల్లి తరలిస్తుండగా యలమంచిలి అటవీ సిబ్బంది మాటువేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వ్యాన్‌లో సుమారుగా 590కి పైగా సరుగుడు దుంగలున్నట్టు గుర్తించారు. వాహనంతో సహా దుంగలను స్వాధీనపర్చుకున్న సిబ్బంది ఈ దందా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకునే పనిలో ఉన్నారు. స్వాధీనపర్చుకున్న సరుగుడు దుంగల వ్యాన్‌ను యలమంచిలి–గాజువాక బైపాస్‌ రోడ్డులో ఓ కర్రల మిల్లులో ఉంచారు. విచారణలో భాగంగా సరుగుడు చెట్లు నరికిన ప్రాంతాన్ని అటవీ అధికారులు పరిశీలించారు. స్వల్ప జరిమానాతో బయటపడేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకులు, కొందరు బడా కర్రల మిల్లుల యజమానులతో అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో అక్రమార్కులు ఉన్నారు. వారం రోజులైనా దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వెంకయ్యపాలెం గ్రామానికి చెందిన ఎరిపిల్లి రాజు సోమవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌, అటవీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు యలమంచిలిలో విలేకరులకు తెలిపారు. అటవీ సంపద అక్రమ రవాణాను అరికట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు జిల్లా కలెక్టర్‌ను కోరాడు.

టన్నుల కొద్దీ కలప, ఇసుక తరలింపు

యలమంచిలి అటవీ రేంజ్‌ పరిధిలో సీతపాలెం, రాంబిల్లి, చిన ఉప్పలం, పోలవరం, తీనార్ల, కేశవరం, పెంటకోట, రాజయ్యపేట, పాయకరావుపేట వరకు సుమారు 950 హెక్టార్లలో షెల్టర్‌బెల్ట్‌ ప్రాంతంలో సరుగుడు, తాటిచెట్లు పెరుగుతున్నాయి. 2015–2016లో అటవీశాఖ సీతపాలెంలో 112 హెక్టార్లలో సరుగుడు, తాటి మొక్కలను నాటింది. పదేళ్లలో అవి ఏపుగా పెరిగాయి. ఇక్కడ సరుగుడు చెట్లు మందంగా పెరగడంతో మార్కెట్లో మంచి ధర వస్తోంది.

దీంతో స్థానికంగా కొందరు ఈ చెట్లను నరికి, కలపను తరలించి లాభపడుతున్నారు. గత మూడేళ్లలో టన్నుల కొద్దీ కలప, సముద్రపు ఇసుకను ట్రాక్టర్లు, వ్యాన్లు, టైరుబండ్లపై తరలించి అమ్ముకున్నట్టు కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు పట్టుబడినా స్వల్ప జరిమానాలతో సరిపెట్టడంతో అక్రమార్కులు తమ పంథా మార్చుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

కఠిన చర్యలు తీసుకోవాలి

అటవీ అధికారుల ఉదాసీనత వల్లే ఇక్కడ కలప యధేచ్ఛగా తరలిపోతోంది. సీతపాలెం,లోవపాలెం ప్రాంతాల్లో సరుగుడు చెట్లు, సముద్రపు ఇసుక అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఇలాగే వదిలేస్తే తీరప్రాంత రక్షణకు ముప్పు తప్పదు. గతంలో కలప, ఇసుక అక్రమ రవాణాపై అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా కఠిన చర్యలు తీసుకోలేదు. దీంతో దీనికి అడ్డుకట్ట పడడం లేదు. జిల్లా కలెక్టరు, అటవీ శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇచ్చాను. ఈ నెల 11వ తేదీన అధికారులకు పట్టుబడిన సరుగుడు దుంగల వ్యాన్‌ సీజ్‌ చేసి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి కారణమైన అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

–ఎరిపిల్లి రాజు, వెంకయ్యపాలెం

నిబంధనల ప్రకారం చర్యలు

సీతపాలెం షెల్టర్‌బెల్ట్‌ ప్రాంతంలో ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి పట్టుబడిన సరుగుడు దుంగల వ్యాన్‌ వ్యవహారంపై ఇప్పటికే అటవీ చట్టాల ప్రకారం చర్యలు ప్రారంభించాం. నిబంధనల ప్రకారం చర్యలుంటాయి. వాహనంతో కలప పట్టుబడడం వల్ల జరిగిన ఘటనపై నా పై అధికారికి నివేదించాను. తదుపరి చర్యలు వారు తీసుకుంటారు. అటవీ ప్రాంతంలో ఇసుక, కలప అక్రమ రవాణాపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాం. ఎవరైనా అక్రమంగా ఇసుక, కలప రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

–అనిల్‌కుమార్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి, యలమంచిలి

కొరవడిన నిఘా..

అటవీ సంపదను రక్షించాల్సిన ఆ శాఖను సిబ్బంది కొరత సైతం వేధిస్తోంది. పోస్టుల మంజూరు మేరకు పూర్తి స్థాయిలో గార్డులు, వాచర్లు లేకపోవడంతో పర్యవేక్షణ కష్టమవుతోందన్నది. అటవీశాఖ అధికారుల వాదన. అయితే అక్రమార్కులకు కొందరు కింది స్థాయి సిబ్బంది సహకారం ఉండడం వల్లనే చెట్ల నరికివేత, అక్రమ రవాణా దందా కొనసాగుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. యలమంచిలి అటవీ అధికారులకు పట్టుబడిన సరుగుడు దుంగల వ్యాన్‌ విషయంలో అధికారులు ఈసారైనా కఠినంగా వ్యవహరిస్తారో?దందా వెనుక ఉన్న అధికార టీడీపీ నాయకులు కావడంతో జరిమానాతో సరిపెడతారో చూడాల్సిందే.

అడవే కదా.. అడిగేదెవరు..!1
1/2

అడవే కదా.. అడిగేదెవరు..!

అడవే కదా.. అడిగేదెవరు..!2
2/2

అడవే కదా.. అడిగేదెవరు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement