ఇంటర్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలి
తుమ్మపాల : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. తాగునీరు ఏర్పా టు చేయాలని జీవీఎంసీ, పంచాయతీ అధికారులను ఆదేశించారు. అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షను అమలు చేయాలని, దగ్గరలోని జెరాక్స్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసివేయాలని, పరీక్ష పత్రాలకు, తనిఖీ బృందాలకు ఎస్కార్ట్, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణ, తనిఖీల్లో సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్యాడ్లు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల బండిల్స్ సకాలంలో పంపించుటకు తపాలా శాఖ సిబ్బంది సహకరించాలని తెలిపారు.
ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు..
ఇంటర్‌మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి ఎం.వినోద్‌బాబు పరీక్షల వివరాలు తెలియజేశారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు వేర్వేరు రోజుల్లో పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. జిల్లాలో 34 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగా చేరుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోనికి ఎవరూ సెల్‌ఫోన్లు తీసురాకూడదని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఓ వై. సత్యనారాయణరావు, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి ఎం.హైమావతి, ఆర్‌టీసీ డిపో మేనేజరు వి.ప్రవీణ, జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు, పోలీస్ అఽధికారి మోహన్‌రావు, పోస్టల్ శాఖాధికారి వంశీకృష్ణ, ఎలక్ట్రికల్, జీవీఎంసీ, ఫైర్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
తుమ్మపాల : గణతంత్ర దినోత్సవం నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహ ణపై కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమా వేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 26న స్థానిక ఎన్‌టీఆర్ స్టేడియంలో వేడుకల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రోటో కాల్ ప్రకారం అందరినీ ఆహ్వానించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబిస్తూ శకటాలను తీర్చిదిద్దాలని, స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మైదానం సిద్ధం చేసి, అలంకరణ ఏర్పాట్లు చేయాలని, వీఐపీ, వీవీఐపీల సీటింగ్ ఏర్పాట్లు, సాధారణ పౌరులు వేడుకలను వీక్షించేందుకు అనువుగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలనారు. శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. బహుమతుల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఏర్పాట్లలో సమన్వయంతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.


