కాసర్ల శ్యామ్‌కు 15వ వేటూరి పురస్కారం
పాయకరావుపేట : వేటూరి సాహితీ పీఠం, శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వేటూరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 29 న ప్రముఖ సినీ పాటల రచయిత కాసర్ల శ్యామ్‌కి వేటూరి పురస్కారాన్ని ప్రధానం చేస్తున్నట్టు వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కలగ రామజోగేశ్వర శర్మ తెలిపారు. ఇప్పటి వరకూ 14 మంది సినీ, సాహితీ రంగ ప్రముఖులకు వేటూరి పురస్కారాలను గత పద్నాలుగు సంవత్సరాలుగా ప్రదానం చేశారు. 15వ వేటూరి పురస్కారాన్ని ప్రముఖ సినీ పాటల రచయిత కాసర్ల శ్యామ్‌కి ప్రదానం చేయునున్నట్టు తెలిపారు. ఈ వేటూరి సాహితీపీఠానికి శాశ్వత గౌరవ అధ్యక్షునిగా తనికెళ్ల భరణి, వ్యవస్థాపక అధ్యక్షునిగా చక్కా సూర్యనారాయణ, అధ్యక్షునిగా సిహెచ్.వి.కె నరసింహారావు వ్యవహరిస్తున్నారు. 15వ వేటూరి పురస్కారాన్ని ఈ నెల 29న తుని పట్టణంలోని గల చిట్టూరి మెట్రోలో నిర్వహిస్తున్నట్టు శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్ధాపకుడు సిహెచ్.విజయ్ ప్రకాష్ తెలిపారు. బలగం సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన ‘ఊరు పల్లెటూరు’ అనే గీతానికిగాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. మహాత్మ సినిమాలో ‘నీలపురి గాజుల ఓ నీలవేణి’ పాట రాసిన శ్యామ్ 2020లో వచ్చిన అల వైకుంఠపురంలో.. సినిమాలోని ‘రాములో రాములా’ పాటతో మంచి గుర్తింపు పొందాడు.


