ఉద్యమ కమిటీలో చీలిక! | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ కమిటీలో చీలిక!

Dec 22 2025 2:07 AM | Updated on Dec 22 2025 2:07 AM

ఉద్యమ

ఉద్యమ కమిటీలో చీలిక!

రాజయ్యపేటలో టెంట్ల తొలగింపు

ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ లేకుండా తొలగింపు తగదని

ఒక వర్గం అసంతృప్తి

గ్రామంలో సమావేశమైన మత్స్యకారులు

రాజయ్యపేటలో నిరాహార దీక్ష కోసం వేసిన టెంట్లు తొలగిస్తున్న దృశ్యం

నక్కపల్లి: బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తూ దాదాపు 70 రోజులపాటు మత్స్యకారులు చేసిన ఉద్యమానికి ప్రభుత్వం ముగింపు పలికింది. ఆదివారం రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి నూకతాత ఆలయం వద్ద మత్స్యకారులు ధర్నా కోసం వేసిన టెంట్లను మత్స్యకారులతో తొలగింపజేశారు. టెంట్ల తొలగింపుపై మత్స్యకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి రాతపూర్వకమైన హామీ లేకుండా టెంట్లు తొలగించడాన్ని కొంతమంది తప్పు పడుతూ ఆదివారం రాత్రి పోలీసు సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరిస్తామని హోం మంత్రి అనిత ఇచ్చిన హామీతో మత్స్యకారులు నెల రోజుల క్రితం తాత్కాలికంగా దీక్షను విరమించిన విషయం తెలిసిందే. శనివారం తాళ్లపాలెం వచ్చిన సీఎం చంద్రబాబు వద్దకు మత్స్యకారులను తీసుకెళ్లారు. ఆయన కేవలం రెండు నిమిషాలు మాట్లాడి ‘మీ గ్రామ పరిధిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయడం లేదని, ఇంకా ఏమైనా సమస్యలుంటే హోం మంత్రి, కలెక్టర్‌తో మాట్లాడండి’ అని ముగించేశారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మత్స్యకారులు చేసేదేమీ లేక మెత్తబడ్డారు. ఇదే అవకాశంగా భావించిన అధికారులు ఆదివారం గ్రామంలోకి వెళ్లి నూకతాత ఆలయం వద్ద నిరాహార దీక్ష కోసం మత్స్యకారులు ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు.

గ్రామస్తులతో పోలీసుల సమావేశం

తొలుత డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ మురళి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయడం లేదని సీఎం తెలియజేసినందున టెంట్లు స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఇక్కడ ఏర్పాటు చేయమని, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, గ్రీన్‌పార్క్‌ మాత్రమే ఏర్పాటు చేయాలని రాతపూర్వకంగా రాసివ్వాలని కొందరు మత్స్యకారులు కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ వద్దకు వెళ్లి కోరాలని కొంతమంది మత్స్యకారులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున కలెక్టర్‌ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత టెంట్లు తొలగించాలని సమావేశానికి వచ్చిన కొంతమంది మత్స్యకారులు సూచించారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకుని టెంట్లు తొలగించాల్సిందేనని, మీరే స్వయంగా టెంట్లు తొలగిస్తే బాగుంటుందని, తాము గనుక తొలగిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరిక ధోరణితో మాట్లాడారు. కమిటీగా ఏర్పడిన వారిలో కొంతమంది టెంట్లు తీసేందుకు సిద్ధపడగా కొంతమంది సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా హామీ లేకుండా టెంట్లు తీయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం మీద ఉద్యమ కమిటీ రెండు వర్గాలుగా చీలిపోయింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వలేదని, కేవలం ఉద్యమాన్ని నీరు గార్చడం కోసమే రాజయ్యపేటలో ఏర్పాటు చేయడం లేదని చెప్పారన్న ప్రచారం జరుగుతోంది.

ఉద్యమ కమిటీలో చీలిక! 1
1/1

ఉద్యమ కమిటీలో చీలిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement