దారులన్నీ అమ్మ సన్నిధికే..
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం మూడో గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే క్యూల్లో బారులు తీరారు. భక్తి ప్రపత్తులతో జరిగిన పూజల నడుమ.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల హడావుడి, ఆలయ నిర్వహణలో పోలీసుల పెత్తనం సామాన్య భక్తులను, ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం గమనార్హం.
విశేషంగా పూజలు
మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.05 గంటల నుంచి 1.30 గంటల వరకు స్వర్ణాభరణాలతో అ లంకరించిన అమ్మవారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అంతకుముందు గణపతి పూ జ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణ, వేద పారాయ ణాలు, శ్రీచక్రార్చన, లక్ష్మీ హోమం జరిపారు. భక్తు లు సమర్పించిన పసుపు కుంకుమ నీళ్లతో జలాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వెండి కవచాలు తొడిగి, దర్శనాలు కల్పించారు.
ఎమ్మెల్యే హవా..
ఓవైపు భక్తులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండగా, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ హవా ఆలయంలో స్పష్టంగా కనిపించింది. గురువారం జరిగిన తొలిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, తన వెంట సుమారు 200 మంది అనుచరులను తీసుకురావడంతో ఉత్సవాల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు, ఉత్సవ కమిటీ సభ్యుల అనుచరులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఎటు చూసినా ఎమ్మెల్యే మనుషులే కనిపించడంతో.. సామాన్య భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
అపురూపం.. కనకమహాలక్ష్మి దర్శనం
కశింకోట: ఇక్కడి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. మార్గశిర మాసం మూడో గురువారాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. భక్తి పారవశ్యంతో తన్మయులయ్యారు. చీరలు, రవికెలు, అరటి గెలల రూపంలో అమ్మ వారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేద మంత్రాల నడుమ క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం అందంగా ఆభరణాలు, నూతన వస్త్రాలు, పూల మాలలతో అందంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వి.చిదంబరం, వి.కృష్ణల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు బందోబస్తు నిర్వహించారు.
దారులన్నీ అమ్మ సన్నిధికే..
దారులన్నీ అమ్మ సన్నిధికే..
దారులన్నీ అమ్మ సన్నిధికే..


