ప్రభుత్వ భూదాహాన్ని అడ్డుకుంటాం..
మిట్టల్ స్టీల్ కోసం పచ్చని తోటల సేకరణ తగదు
టౌన్‌షిప్ కోసం భూములిచ్చేది లేదు
అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో స్పష్టం చేసిన రైతులు
అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకుల భరోసా
నక్కపల్లి: తరతరాలుగా పేద రైతు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న పచ్చని కొబ్బరి, మామిడి, జీడి తోటలను మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం సేకరించడం తగదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు అన్నారు. ప్రభుత్వ భూదాహాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. మండలంలో ఏర్పాటు చేయనున్న ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కోసం ప్రభుత్వం సేకరించ తలపెట్టిన రెండో విడత భూములను గురువారం స్థానిక రైతులతో కలసి అఖిల పక్ష నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వీసం మాట్లాడుతూ నెల్లిపూడిలో టౌన్‌షిప్ ఏర్పాటుకు 400 ఎకరాలు కేటాయించాలని కంపెనీ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేయడంతో ఏపీఐఐసీ అధికారులు భూసేకరణకు చర్యలు చేపట్టారన్నారు. నెల్లిపూడిలో సర్వే చేసి భూములు గుర్తించారన్నారు. ఈ భూముల్లో ఏటా ఫలసాయం అందిస్తున్న మామిడి, జీడి, కొబ్బరి తోటలు ఉన్నాయన్నారు. ఏటా లక్షలాది రూపాయల ఆదాయం వస్తుండడంతో రైతులు ఈ భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటికే మండలంలో డీఎల్‌పురం, వేంపాడు, చందనాడ, రాజయ్యపేట, అమలాపురం గ్రామాల పరిధిలో 2,020 ఎకరాలు కేటాయించారన్నారు. టౌన్‌షిప్ కోసం మరో 400 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. జీవనాధారమైన భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరన్నారు. తమకు అండగా నిలవాలని భూ యజమానులంతా తమను కోరడంతో ఈ భూముల పరిశీలనకు వచ్చామన్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం రైతులకు ఏ మూలకు చాలదన్నారు. ఇప్పటికే ఏపీఐఐసీకి భూములు, నివాస ప్రాంతాలు త్యాగం చేసిన రైతులంతా రోడ్డున పడ్డారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నష్ట పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించలేదన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేయాలన్నారు. లేదంటే ఎటువంటి పోరాటానికై నా వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ వింగ్ జిల్లా అధ్యక్షుడు సూరాకాసుల గోవిందు, సీపీఎం మండల కన్వీనర్ ఎం.రాజేష్, రైతులు శ్రీనురాజు, సుబ్బరాజు, కురందాసు నాని, రమేష్‌రాజు జోగిరాజు, అప్పలరాజు, పేర్రాజు, బి.తాతారావు, సాగర్, కన్నంరాజు, కె.రమణ, తదితరులు పాల్గొన్నారు.


