సింహగిరిపై శ్రీనృసింహ దీక్షల వైభవం
సింహాచలం :
సింహగిరిపై 32 రోజుల శ్రీ నృసింహ దీక్షలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా మాలధారణ చేశారు. ఆలయ రాజగోపురం పక్కన మాడవీధిలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటుచేసి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ప్రతిమను ఉంచారు. దేవస్థానం ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ మూర్తి, అర్చకులు ఆలయంలో నుంచి తులసి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామిచెంతన ఉంచి విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. స్వామివారి అష్టోత్తర శతనామావళిని దీక్షాధారులందరిచేత పఠింపజేశారు. అనంతరం మాలధారణ చేశారు. తులసి మాల, ప్రతిమ ఉచితంగా అందజేయడంతోపాటు స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. దీక్ష తీసుకున్నవారిలో సింహాచలం ప్రాంతానికి చెందిన శ్రీ చందన పెరుమాళ్ పీఠం, సింహాద్రిమఠం, శ్రీనృసింహ పెరుమాళ్ పీఠంకి చెందిన భక్తులు ఉన్నారు. దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈనెల 3 నుంచి 41 రోజుల శ్రీ నృసింహ దీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జనవరి 12వ తేదీన రెండు దీక్షల విరమణ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు.
32 రోజుల దీక్షలు ప్రారంభం
సింహగిరిపై శ్రీనృసింహ దీక్షల వైభవం


