అల్లిపురంలో రాపిడ్ రెస్పాండ్ టీమ్
దేవరాపల్లి: దేవరాపల్లి శివారు అల్లిపురంలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందిన వ్యక్తి నివాస ప్రాంతాన్ని కేజీహెచ్ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన రాపిడ్ రెస్పాండ్ టీమ్ గురువారం పరిశీలించింది. రామారావు, విజయ్, యోగితతో కూడిన వైద్య నిపుణుల బృందం మృతి చెందిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై మృతుడి కుటుంబ సభ్యులను ఆరా తీశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అప్పటి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నామని మృతుడి కుటుంబ సభ్యులు కేజీహెచ్ వైద్య బృందానికి తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధితోనే మరణించాడని, దీనిపై తమకు ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. దేవరాపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఇ.పూజ్యమేఘన నుంచి సైతం వైద్య నిపుణుల బృందం మృతికి సంబంధించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అల్లిపురంలో నివాసం ఉంటున్న 15 కుటుంబాలను వైద్య బృందం కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, ఫీవర్ సర్వే చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి అనంత ఉమాదేవి పారిశుధ్య పనులను చేయించారు. కేజీహెచ్ వైద్య నిపుణుల బృందం వెంట స్థానిక పీహెచ్‌సీ సీహెచ్‌వో ఎం.ఆనంద్, హెల్త్ సూపర్‌వైజర్ కె.పుష్పరాజ్, ఏఎన్‌ఎం మేరీ, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


