సత్ఫలితాలిస్తున్న మత్తు విముక్తి కేంద్రం
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు
● 15 మంది రోగులు ఇన్‌పెషేంట్‌లు,
30 మంది అవుట్ పేషెంట్లకు చికిత్సలు
● మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు
అనకాపల్లి: మారుతున్న కాలంలో యువత, అన్ని వర్గాల ప్రజలు మాదక ద్రవ్యాలు, మద్యం మత్తులో నేరాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలామంది యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మత్తు పదార్ధాలు, ఆల్కహాల్‌కు బానిసలు కావడంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రధానంగా పేద, మధ్య తరగతి వర్గాల్లో ఈ దురలవాట్లు వారి జీవన విధానంపై ఎంతో దుష్ప్రప్రభావం చూపుతోంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రత్యేక వార్డు...
వైఎస్సార్‌సీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో మాదక ద్రవ్య కేంద్రాన్ని 2020లో ఏర్పాటు చేశారు. చెడు వ్యాసనాల నుంచి విముక్తి కలిగించేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. చుట్ట, బీడీ, సిగరెట్, గంజాయి, డ్రగ్స్ మొదలగు మత్తు పదార్థాలతో పాటు మద్యపానం వంటి వ్యసనాల నుంచి దూరం అవ్వాలనుకునే వారి కోసం మత్తు వ్యసన విముక్తి విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చికిత్సతో పాటు ఉచితంగా మందులు అందుబాటులోనికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వం నుంచి అవగహన కార్యక్రమాలు నిర్వహించడం, ఆస్పత్రుల్లో చేరే రోగికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా మందుల వినియోగానికి బాధితులు ముందుకొస్తున్నారు.
రోగుల సంఖ్య పెరుగుదల...
అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాదక ద్రవ్యాలు సేవించే వ్యక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆస్పత్రిలో 15 బెడ్స్ ఏర్పాటు చేశారు. రోజుకు 15మంది ఇన్‌పేషెంట్, 30 మంది ఔట్‌పేషెంట్లకు నిత్యం చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ విభాగంలో తొమ్మిది మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు కౌన్సిలర్స్, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఇద్దరు వార్డు బోయ్స్, ఒక కంప్యూటర్ డేటా ఆపరేటర్, ఒక కోఆర్డినేటర్, వైద్యుడు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.
నికోటిన్ మందులు, కౌన్సెలింగ్ ద్వారా...
నేషనల్ హెల్త్‌మిషన్ ప్రొగ్రాంలో భాగంగా నేషనల్ టోబాకో కంట్రోల్ ప్రొగ్రాం ద్వారా మాదక ద్రవ్యాల అలవాట్ల నియంత్రణకు నికోటిన్ మందులు ఉపయోగపడుతున్నాయి. డ్రగ్స్‌కు అలవాటుపడిన వారు ఎంతమేరకు వినియోగిస్తున్నారో తెలుసుకుని వారి ఆరోగ్యం స్థితిని పరిశీలించి, వైద్యులు వివిధ పరిమితుల్లో మందులు అందజేస్తున్నారు. వీటిని రెండు రకాలుగా అందుబాటులోకి తీసుకువచ్చారు. నికోటిన్ ఫ్యారస్(స్టిక్కర్ రూపంలో) 7 ఎంజీ, 14 ఎంజీ, 21 ఎంజీ రూపంలో చేతి భుజానికి స్టిక్కర్ అతికించే విధానంలో వేస్తున్నారు. నికోటిన్ గమ్స్ రూపంలో పంటి కింద పెట్టుకునేలా 2 ఎంజీ, 4 ఎంజీ మోతాదులో అందిస్తున్నారు. ఆల్కహాల్ బాధితులకు కూడా వారు మద్యం సేవించే పరిమితి, ఆరోగ్య స్థితిని బట్టి మందుల రూపంలో నెల నుంచి 3 నెలల కోర్సుగా మందులు వాడిస్తున్నారు. నేషనల్ టోబాకో కంట్రోల్ ప్రొగ్రాం ప్రతినిధులు, ఇన్‌పేషెంట్లకు కలిసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలు, ప్రైవేట్ పాఠశాలలు, స్వచ్ఛంద సేవా సిబ్బందికి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఉచితంగా మందులు
ఆస్పత్రిలో మత్తు విభాగంలో ఒక వైద్యుడు నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. మరో 8 మంది సిబ్బంది వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. రోజుకు 30 మంది రోగులు వస్తున్నారు. అవసరమైన రోగులకు ప్రత్యేకంగా 15 బెడ్లు ఏర్పాటు చేశాం. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు ఉచితంగా అందజేస్తున్నాం.
– కృష్ణచంద్ర, మత్తు విముక్తి కేంద్రం
విభాగం వైద్య అధికారి
అవగాహన కార్యక్రమాలు
మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు, వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజల్లో కొంతమేరకు మార్పు వచ్చింది. ప్రారంభంలో రెండు, మూడు కేసులు రావాలంటే ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం రోజుకు 30 మందికి పైగా రోగులు వస్తున్నారు. మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ బారిన పడకుండా పిల్లల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
–ఎస్.క్రాంతికుమార్, మత్తు విముక్తి
విభాగం, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్,
అనకాపల్లి ఆస్పత్రి
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి
సత్ఫలితాలిస్తున్న మత్తు విముక్తి కేంద్రం
సత్ఫలితాలిస్తున్న మత్తు విముక్తి కేంద్రం
సత్ఫలితాలిస్తున్న మత్తు విముక్తి కేంద్రం


