ఊళ్లూ నీళ్లూ ఏకమై..
మోంథా తుపాను జిల్లాలో బీభత్సం సృష్టించింది. రెండు రోజులుగా కుండపోతగా భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లావ్యాప్తంగా సోమవారం సగటున 78.2 మి.మీ. వర్షాలు కురవగా.. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు 101 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా వర్షాలు కురవడంతోపాటు ఈదురుగాలులు వీచడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. వంతెనలపై నుంచి వాగులు, గెడ్డలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
సాక్షి, అనకాపల్లి: భారీ వర్షాలతో ఊళ్లూ నీళ్లూ ఏకమయ్యాయి. రెండు రోజులపాటు ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో అన్ని ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. వాగులు, గెడ్డలు, చెరువుల నుంచి నీరు పొంగిపొర్లడంతో వరిపంట నీట మునిగింది. పెద్దేరు, తాండవ, కోనాం, రైవాడ, కల్యాణపులోవ రిజర్వాయర్లలో ఎగువ ప్రాంతం నుంచి వర్షపు నీరు చేరి నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో దిగువకు నీరు విడుదల చేశారు. భీమునిపట్నం–నర్సీపట్నం బీఎన్ రోడ్డుతోపాటు జిల్లాలో పలు రోడ్లలపై గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహదారులు ప్రమాదాలకు లోనయ్యారు. చూచుకొండ, రాంబిల్లి, కొత్తూరు, పురుషోత్తపురం, బుచ్చెయ్యపేట, చిన అప్పన్నపాలెం, బోనంగి, నాయుడు పాలెం మొదలైన ప్రాంతాల్లో తీవ్రమైన గాలులు, అధిక వర్షపాతం వలన పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
ప్రమాదకరంగా జలాశయాలు
మోంథా తుపాను కారణంగా జలాశయాలు ప్రమాదకరంగా మారాయి. గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.
● తాండవ రిజర్వాయరు ప్రమాదస్ధాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ఎగువ ప్రాంతం నుంచి అధికంగా నీరు రావడంతో 378 అడుగులకు చేరింది.
● పెద్దేరు రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 136.60 మీటర్లుగా ఉంది.
● రైవాడ రిజర్వాయర్‌లో గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా.. 112.3 మీటర్లకు చేరింది. 2700 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.
● కల్యాణపులోవ జలాశయం గరిష్ట నీటిమట్టం 460 అడుగులు కాగా 458.01 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు
తీరప్రాంతం, లోతట్టు ప్రాంతాల్లోని 136 గ్రామాల్లో నివసిస్తున్న 3,930 మందిని గుర్తించి 68 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 381 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాలో గల 5,35,492 రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేశారు. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను ఆర్ అండ్ బీ విభాగం వారు, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ వారి సహకారంతో తొలగించారు. 71 మంది నిండు గర్భిణులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో 55 మంది ప్రసవించగా..16 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
● దేవరాపల్లి మండలంలో గిరిజన గ్రామాల నుంచి 97 మందిని మంగళవారం పునరావాస కేంద్రాలకు తరలించారు.
● కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో బలిఘట్టం శ్రీబ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయ కొండపై నివాసం ఉంటున్న కుటుంబాలను బలిఘట్టం జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.
● తుపాను కారణంగా హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, సీలేరు ప్రాంతాలకు వెళ్లే బస్సులను రద్దు చేసినట్లు నర్సీపట్నం డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు.
● నర్సీపట్నం అయ్యన్న కాలనీలో సోమిరెడ్డి రాములమ్మ అనే వృద్ధురాలు మంగళవారం విద్యుదాఘాతానికి గురైంది. గాయపడిన మహిళను సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు.
● కోటవురట్ల మండలం రామన్నపాలెంలో పైల రమణబాబుకు చెందిన పెంకుటిల్లు కొంతమేర కూలిపోయింది. కై లాసపట్నం శివారున భారీ వృక్షం మెయిన్‌రోడ్డుకు అడ్డుగా కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
● ఎస్.రాయవరం మండలంలో ఉప్పరాపల్లిరోడ్డు, ఎస్.రాయవరం రెల్లి కాలనీల్లో భారీ వృక్షాలు కూలడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
● చోడవరం మండలంలో గోవాడ, పీఎస్‌పేట, జుత్తాడ, గవరవరంతోపాటు పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
● రావికమతం మండలంలో టి.అర్జాపురంలో వేములపూడి అక్కమ్మ రేకుల షెడ్డుపై చెట్టు కూలింది.ఽథర్మవరంలో పల్లా బ్రహ్మలింగస్వామి రేకుల ఇంటిపై చెట్టు పట్టడంతో ఇల్లు ధ్వంసమైంది.
● యలమంచిలి పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డులో గొల్లప్రోలు ఆస్పత్రి సమీపంలో రోడ్డుపై పెద్ద చెట్టు కొమ్మ విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనా ల రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
● అచ్యుతాపురం మండలంలో మడుతూరు, గొర్లె ధర్మవరాల్లో రెండు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కొండకర్ల నుంచి ఎం.జగన్నాథపురం వెళ్లే మార్గంలోని కల్వర్టు గోడ శిథిలమయింది.
తుమ్మపాల: అనకాపల్లి మండలం
శంకరంలో నీట మునిగిన వరి పొలాలు
జిల్లాను ముంచేసిన ‘మోంథా’
101 మి.మీ. సగటు వర్షపాతం
ఈదురుగాలులకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
వంతెనల మీదుగా పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
రిజర్వాయర్లలో ప్రమాద స్థాయికి
నీటిమట్టాలు
దిగువకు నీరు విడుదల..
నీట మునిగిన పొలాలు
జిల్లాలో వర్షపాతం వివరాలు
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 101.0 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
మండలం వర్షపాతం (మి.మీ.)
సబ్బవరం 167.8
రాంబిల్లి 156.2
పరవాడ 150.4
అచ్యుతాపురం 137.8
కె.కోటపాడు 134.0
చోడవరం 126.4
మునగపాక 125.6
నక్కపల్లి 119.2
బుచ్చెయ్యపేట 112.2
ఎస్.రాయవరం 102.8
యలమంచిలి 102.8
కశింకోట 98.6
అనకాపల్లి 98.4
రావికమతం 98.2
రోలుగుంట 90.0
పాయకరావుపేట 80.6
చీడికాడ 80.2
నర్సీపట్నం 75.4
మాకవరపాలెం 72.4
కోటవురట్ల 66.8
నాతవరం 51.0
గొలుగొండ 59.8
దేవరాపల్లి 66.4
మాడుగుల 50.0
ఊళ్లూ నీళ్లూ ఏకమై..
ఊళ్లూ నీళ్లూ ఏకమై..
ఊళ్లూ నీళ్లూ ఏకమై..
ఊళ్లూ నీళ్లూ ఏకమై..
ఊళ్లూ నీళ్లూ ఏకమై..


