భయంభయంగా వాహన రాకపోకలు
బుచ్చెయ్యపేట: తుపాను వర్షాలకు మండలంలో డైవర్షన్ రోడ్లు ప్రమాదకరంగా తయారయ్యాయి. వీటిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని వాహనదారులు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. వడ్డాది మేజర్ పంచాయతీలో పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డుపై నుంచి రేయింబవళ్లు వరదనీరు ప్రవహిస్తోంది. దాంతో రాత్రిళ్లు వేగంగా వస్తున్న వాహనదారులకు చీకట్లో నీటి ప్రవాహం కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. నర్సీపట్నం, చోడవరం ఆర్టీసీ బస్సులతోపాటు పాడేరు నుంచి కాకినాడ, రాజమండ్రి వరకు, విశాఖ నుంచి కొత్తకోట, బుచ్చెయ్యపేట, పెదమదీనకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, లారీలు, వ్యాన్లు ఇతర వాహనాలు నీట మునిగిన డైవర్షన్ రోడ్డుపై నుంచి ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నాయి. విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డును ఆనుకుని నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది మట్టి డైవర్షన్ రోడ్డు కావడంతో ఎప్పుడు గండిపడుతుందోనని వాహనదారులు భయపడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల తాచేరు డైవర్షన్ రోడ్డు వద్ద వడ్డాది రైతు, పేట విద్యార్థి కాలు జారి నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వేరే గత్యంతరం లేక ఈ డైవర్షన్ రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నారు. వీటి స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.
బుచ్చెయ్యపేట: వడ్డాదిలో నీటి ప్రవాహంలో వాహనదారుల ప్రయాణం
పేటలో డైవర్షన్ రోడ్డును ఆనుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు
బుచ్చెయ్యపేటలో ప్రమాదకరంగా
డైవర్షన్ రోడ్లు
భయంభయంగా వాహన రాకపోకలు


