వివాహిత మృతిపై కేసు నమోదు
యలమంచిలి రూరల్: పట్టణంలోని గాంధీనగర్‌లో ఆదివారం వివాహిత మృతిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ నివాసముంటు న్న ముమ్మిన సత్యంరాజు భార్య రిజుత(26) ఆదివారం అకస్మా త్తుగా అనారోగ్యంతో మృతి చెందినట్టు మృతురాలి తండ్రి దొడ్ద రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని యలమంచిలి తహసీల్దార్ కె.వరహాలు, పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి పరిశీలించారు. అయితే మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, శవపంచనామా అనంతరం పోస్టుమార్టం పూర్తి చేయించారు.
త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారకుడిపై దాడి
తగరపువలస: త్రైత సిద్ధాంత భగవద్గీతను ప్రచారం చేస్తున్న ప్రభోదానందుని శిష్యులపై ఆదివారం భీమిలి, తగరపువలస ప్రాంతాల్లో దాడి జరిగింది. ఫిజియోథెరపిస్ట్ అయిన ముమ్మిడిశెట్టి ఆదిత్య అనే వ్యక్తి మరికొందరితో కలిసి తమపై దాడి చేశారని, త్రైతసిద్ధాంత భగవద్గీత గ్రంథాలను విసిరి, ప్రచార స్టాళ్లను విరగ్గొట్టారని భీమిలి మండలం తాటితూరుకు చెందిన బోని శ్రీనివాసరావు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు ఇరువర్గాలను పిలిచి విచారణ చేస్తున్నారు.
రోడ్ల పునరుద్ధరణకు రూ.7.20 కోట్లు
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: మాకవరపాలెం మండలంలో రోడ్లు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.7.20 కోట్లు మంజూరు చేసిందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం వీడియో విడుదల చేశారు. అర్‌అండ్‌బీ శాఖ ద్వారా ఈ నిధులు విడుదలయ్యాయని తెలిపారు. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కోటువురట్ల మండలం కై లాసపట్నం నుంచి మాకవరపాలెం మండలం రాచపల్లి రోడ్డు, వయా చౌడువాడ, నగరం, కోడూరు మీదుగా రహదారి పునరుద్ధరణకు రూ.4.60 కోట్లు, మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం జంక్షన్ నుంచి రోలుగుంట వయా లచ్చన్నపాలెం, కుసర్లపూడి వరకు ఉన్న రహదారి పునరుద్ధరణకు రూ.2.60 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ రెండు పనులకు ప్రభుత్వం మొత్తం రూ.7.20 కోట్లు మంజూరు చేసిందన్నారు.


