 
															నేడు సింహగిరిపై నరకాసురవధ
సింహాచలం : నరకచతుర్దశిని పురస్కరించుకుని సోమవారం రాత్రి సింహగిరిపై జరిగే నరకాసురవధ ఉత్సవానికి దేవస్థానం వైదిక, అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో భాగంగా నరకాసురుడి విగ్రహాన్ని ఒక పల్లకిలోనూ, శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను మరొక పల్లకిలోనూ వేంజింపజేస్తారు. అనంతరం సింహగిరి మాడవీధిలో ఈ రెండు పల్లకీలను ఎదురెదురుగా ఉంచి, శాస్త్రోక్తంగా నరకాసుర వధ ఘట్టాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా యుద్ధ సన్నివేశాలు, నరకాసుర వధ ఘట్ట విన్నపం పూజలు జరుపుతారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దేవస్థానం డిప్యూటీ ఈవో సింగం రాధ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
