
15న మున్సిపల్ కార్మికుల ‘చలో విజయవాడ’
అనకాపల్లి: మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని జీవీఎంసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. స్థానిక జోనల్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జోనల్ కమిషనర్ బి.వి.రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ మాట్లాడుతూ మున్సిపల్ పర్మినెంట్ కార్మికులకు పెండింగ్ డీఏలు, రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యుటీ సత్వరం విడుదల చేయాలన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అందని ద్రాక్షగా మారాయని మండిపడ్డారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అందక, మరోవైపు పిల్లల ఉన్నత చదువులు, కుటుంబ పోషణ, రవాణా ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలోనే కేటగిరీల వారీగా వేతనాలు అందకపోతే, ప్రైవేట్ సంస్థల్లో కార్మికులకు కనీస వేతన చట్టాలు ఏ రకంగా అమలవుతాయని ప్రశ్నించారు. జోన్ పరిధిలో ఇంజినీరింగ్, నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, స్కూల్ స్వీపర్లు, పార్కు కూలీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ ఈ నెల 15న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నిమ్మకాయల నర్సింహమూర్తి, ఎర్రంశెట్టి అప్పలరాజు, బంగారి రవి, సోమధుల శ్రీనివాస్, సింగపల్లి అజయ్, ఎర్రం శెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.