
సైడ్ లైట్స్
● గిరి ప్రదక్షిణ ప్రారంభించేందుకు ఉదయం 6 గంటల నుంచే భక్తులు సింహాచలం చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు రథోత్సవం ప్రారంభం సమయానికి తొలిపావంచా నుంచి పాత అడవివరం జంక్షన్ వరకు ఇసుకేస్తే రాలనంతగా భక్తులు బీఆర్‌టీఎస్ రోడ్డులో కిక్కిరిశారు.
● ఉదయం 6 గంటలకే గిరి ప్రదక్షిణ ప్రారంభించిన పలువురు భక్తులు సాయంత్రానికే తిరిగి సింహాచలం చేరుకున్నారు. వారందరికీ రాత్రి 9 గంటల వరకు స్వామి దర్శనాలు అందజేశారు.
● తొలిపావంచా వద్దకు వెళ్లలేని భక్తులు రోడ్లపైన, బీఆర్‌టీఎస్ రోడ్డును ఆనుకుని ఏర్పాటుచేసిన గోడపైన కొబ్బరికాయలు కొట్టారు. దీంతో తొలిపావంచా వద్ద రోడ్డుపైనే కొబ్బరికాయచెక్కల కుప్ప పెద్ద ఎత్తున ఏర్పడింది.
● భక్తులు కొట్టిన కొబ్బరి చెక్కలు తరలించేందుకు క్రేనులు, లారీలు ఏర్పాటు చేశారు.
● దేవస్థానం బస్టాండ్‌లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అయినా తప్పిపోయిన వాళ్ల బంధువులు అక్కడికి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు.
● తొలిపావంచా ఎదురుగా మధ్యాహ్నం నుంచి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సులు పెద్ద ఎత్తున నిలపడంతో.. అక్కడకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
● పారిశుధ్య నిర్వాహణలో జీవీఎంసీ దారుణంగా విఫలమైంది. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు కొద్దిపాటి చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తిన జీవీఎంసీ సిబ్బంది.. సాయంత్రం భక్తుల రద్దీ పెరిగేసరికి చేతులెత్తేశారు. మేయర్, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎక్కడిక్కడే చెత్త పేరుకుపోయింది.
● 32 కిలోమీటర్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షల కారణంగా మరో పది కిలో మీటర్లు అదనంగా నడిచిన భక్తులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు.
● గిరి ప్రదక్షిణలో మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లలు తప్పిపోకుండా వారి చేతులకు ఏఐ ట్యాగ్‌లు వేశారు. గత ప్రభుత్వం హయాంలో ఈ విధానాన్ని అమలు చేయగా, ఈ ఏడాది కూడా అధికారులు కొనసాగించారు.
చోరుల చేతివాటం
గిరి ప్రదక్షిణ వేళ చోరులు చేతివాటం ప్రదర్శించారు. సింహచలం తొలి పావంచ మొదలుకొని అడవివరం, ఆరిలోవ, హనుమంతవాక, నగరంలో పలు చోట్ల మహిళల మెడలో బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్లు, నగదు దొంగిలించినట్లు ఆయా ప్రాంతాల్లోని పోలీసులకు బాధితులు ఫిర్యాదులు చేశారు.

సైడ్ లైట్స్

సైడ్ లైట్స్